ఒంటరి మహిళలకు పింఛన్లు ఇవ్వకుండా.. వితంతు మహిళలను ఆదుకోకుండా.. రిటైర్డ్ ఎంప్లాయిస్ పింఛన్లు నిలిపివేయడం.. జీతాల్లో కోతలు పెట్టడం.. కొత్త పథకాలు లేవు.. పాత వాటికి పైసలు లేవు.. ఇదీ మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పని. ప్రజలకు కోతలు పెట్టి.. ప్రచారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ కార్యాలయాలు నిర్మించినా వాటికి తమ పార్టీ ‘రంగు’ కనిపించాలంటూ తహతహలాడుతున్నాయి. ఇటీవల ఏపీలో పంచాయతీ కార్యాలయాలకు వైఎస్సార్సీపీ పార్టీ రంగులు వేయించారు. దీనిపై అక్కడి హైకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులేంటి అంటూ నిలదీసింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో నిర్మిస్తున్న రైతు వేదికలపై గులాబీ రంగులతోపాటే ఏకంగా కేసీఆర్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి.
Also Read: బాబుకు కలిసిరాని వాస్తు.. జగన్ కు కలిసొస్తుందా?
‘ప్రభుత్వ కార్యాలయాలకు ఒక రాజకీయ పార్టీ రంగు పులిమేందుకు రూ.కోట్లు కుమ్మరించడాన్ని ఎవరైనా మర్చిపోగలరా? పేద, బడుగు వర్గాల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలతో కార్యక్రమాలను చేపడితే అంగీకరించాల్సిందే. కానీ ప్రజాధనం సరిగ్గా వినియోగమవుతోందా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. వివిధ పథకాల కోసం రూ.కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. వితంతువులకు ఇచ్చే కొద్దిపాటి పింఛన్ డబ్బును నిలిపేయడం సరికాదు. రాజకీయ కారణాలతోనే ఒకవేళ పింఛన్లు ఆపితే అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నది మా అభిప్రాయం” … ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు
అంతేకాదు.. ‘ప్రభుత్వం ప్రజాధనానికి ధర్మకర్త అన్న విషయాన్ని గుర్తెరగాలి. ప్రజాధనాన్ని ప్రజలకు సరైన పద్ధతిలో ఉపయోగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన డబ్బును తన ఇష్టానుసారంగా ఖర్చు చేయడానికి లేదు. ఈ ప్రజాధనం ప్రతి పౌరుడి ఆస్తి. గతంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యయం చేశారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఎవరైనా అడిగారా? ఏ క్రైస్తవుడైనా ‘క్రిస్మస్ కానుకలు’ అడిగారా? ఏ ముస్లిమైనా ‘రంజాన్ తోఫా’ కోసం విన్నవించారా?’ అని నిలదీసింది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామానికి చెందిన 175 మంది, పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన ఐదుగురు పింఛన్ల నిలిపివేతపై వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. తమకు గతేడాది సెప్టెంబరు నుంచి పింఛన్లు ఇవ్వడం లేదని బిర్లంగి గ్రామస్తులు, మార్చి నుంచి రావడం లేదని పెనుబర్తి వాసులు అందులో పేర్కొన్నారు. పిటిషనర్లంతా అణగారిన వర్గానికి చెందిన వారు కావడంతో వారి సంప్రదాయం ప్రకారం కులపెద్దల నిర్ణయం మేరకే భార్యాభర్తలు విడిపోతారని, అందువల్ల విడాకులకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఉండవని బిర్లంగి పిటిషనర్ల తరఫు న్యాయవాది కొర్లా వెంకటేశ్వర్లు కోర్టుకు వివరించారు. మృతుల వివరాలు కూడా గ్రామ పంచాయతీలో నమోదు చేయరని, అందువల్ల ఎలాంటి సర్టిఫికేట్లూ ఉండవని పేర్కొన్నారు. ఐదేళ్ల నుంచి వీరికి వితంతు, భర్తతో విడిపోయిన ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్లు ఇస్తున్నారని, కానీ ప్రభుత్వం మారాక పింఛన్లు నిలిపేశారని వివరించారు.
పెనుబర్తి వాసులు వేసిన పిటిషన్‌పై న్యాయవాది ఎం.కృష్ణారావు వాదనలు వినిపిస్తూ.. పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారని ఇద్దరికి, భూములున్నాయని మరో ముగ్గురికి పింఛన్లు నిలిపివేశారని వివరించారు. ప్రభుత్వ న్యాయవాదులు మాత్రం పింఛన్ పొందేందుకు పిటిషనర్లు అర్హులు కాదని, విచారణ చేపట్టాకే నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తీర్పు వెల్లడించారు.
Also Read: హైదరాబాద్ లో కూర్చుంటే ఎలా బాబు? షాకిచ్చిన అయ్యన్న
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం పట్ల ఉన్న శ్రద్ధ వితంతువుల పింఛన్లపై లేకపోయిందని దుయ్యబట్టింది. ధ్రువీకరణ పత్రాలు లేవన్న సాకుతో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు నిలిపేయడాన్ని నిలదీసింది. భర్త బతికుండగా ఏ మహిళా తాను వితంతువునని, ఒంటరి మహిళనని చెప్పుకోదని, ఈ విషయాన్ని మానవతా దృక్పథంలో పరిశీలించాలని హితవు పలికింది. కుమారుడు ప్రభుత్వ ఉద్యోగి అన్న కారణంగా 78 ఏళ్ల మహిళకు పింఛన్ నిలిపేశామన్న వాదన సరైనదేనా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారాల్లో ఎలాంటి విచారణ చేపట్టకుండానే పింఛన్లు ఆపేశారని, ఈ చర్య చట్టవిరుద్ధమని, ఏకపక్షమని ధ్వజమెత్తింది. ఎప్పటి నుంచి పింఛన్లు నిలిపేశారో అప్పటినుంచి మొత్తం పింఛన్‌ను 15 రోజుల్లోగా చెల్లించాలని సంబంధిత అధికారులను హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పు వెల్లడించారు.