మావోయిస్టు అగ్రనేత ‘గణపతి’ లొంగు‘బాట’.!

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పోలీసుల నుంచి కూడా లైన్‌ క్లియర్‌‌ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్యం సమస్యలతో బాధపడుతుండడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గణపతే కాదు.. ఆయనతో పాటు ఇంకా ఎవరు లొంగిపోయిన స్వాగతిస్తామంటూ పోలీసు శాఖ కూడా ప్రకటించింది. పోలీసు వర్గాల సమాచారం […]

Written By: NARESH, Updated On : September 1, 2020 8:28 pm
Follow us on


మావోయిస్టు పార్టీ అగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పోలీసుల నుంచి కూడా లైన్‌ క్లియర్‌‌ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్యం సమస్యలతో బాధపడుతుండడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గణపతే కాదు.. ఆయనతో పాటు ఇంకా ఎవరు లొంగిపోయిన స్వాగతిస్తామంటూ పోలీసు శాఖ కూడా ప్రకటించింది. పోలీసు వర్గాల సమాచారం మేరకు రానున్న రెండు రోజుల్లో లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన వెంట గార్డ్స్‌ కూడా లొంగిపోతున్నట్లు తెలుస్తోంది.

జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ గ్రామానికి చెందిన గణపతి 40 ఏళ్ల పాటు విప్లయోధ్యమంలో కీలక పదవులు అనుభవించారు. సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగానూ పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2018లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో నంబాల కేశవరావు బాధ్యతలు తీసుకున్నారు. పీపుల్స్ వార్ పార్టీని ఆ తరువాత కాలంలో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందించడంలోనూ, దేశ వ్యాప్తంగా విప్లవ సామ్రాజ్యాన్ని విస్తరించడంలోనూ గణపతి కీలక భూమిక పోషించారు. తాజాగా గణపతి లొంగబాటు వార్తలు తెరపైకి రావడంతో అంతటా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల పాటు పనిచేసిన ఆయన లొంగిపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దేశంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టుగా ఉన్న గణపతి తలపై ప్రభుత్వం భారీ రివార్డు కూడా ప్రకటించింది. పీపుల్స్ వార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మూడేళ్లుగా ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొంత కాలంగా ఆయనని క్యాడర్ కూడా దండకారణ్యంలో మోసుకుంటూ తిప్పుతున్నట్లు సమాచారం. ఇక వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే గణపతి లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసింది. గణపతి లొంగుబాటు కోసం తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ పోలీసులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆయన లొంగుబాటులో తెలంగాణ పోలీసులే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

గణపతి లొంగుబాటు లాంఛనమైతే ఆయనతోపాటు కీలక లీడర్లు, మరికొంత మంది కూడా లొంగిపోయే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే ఇక భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకమనే చెప్పాలి. అందరూ లొంగిపోయే బాటలో పయనిస్తే ఇక కొత్త రిక్రూట్‌మెంట్‌కు కూడా బ్రేక్‌ పడక తప్పదు.