Etela Rajender: తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ప్రచారం మంగళవారంతో ముగిసింది. మైకులు మూగబోయాయి. చివరి రోజు మూడు పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. దాదాపు నెల రోజులు చెదురుముదురు ఘటనలు మినహా ప్రచారమంతా ప్రశాంతంగా సాగింది. కానీ చివరి రోజు టీఆర్‌ఎస్.. ఆ పార్టీ బహిష్కృతనేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేదర్‌ను టార్గెట్ చేసింది. ఆ పార్టీ నాయకులు భౌతిక దాడికి ప్రయత్నించారు. ఇదంతా టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు డైరెక్షన్‌లోనే జరిగిందా అంటే అవుననే అంటున్నారు బీజేపీ నాయకులు.

అత్తగారి ఊళ్లో ఈటలకు పట్టు..
ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి స్వగ్రామం మునుగోడు మండలం పలివెల. ఈ గ్రామం గత ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌కు మంచి పట్టు ఉండేది. ఉప ఎన్నికల నేపథ్యంలో జమునారెడ్డి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టారు. బీజేపీవైపు మళ్లించడంలో విజయవంతమయ్యారు. ఈ క్రమంలో ప్రచారం చివరి రోజు అత్తగారి ఊళ్లో ప్రచారం చేయాలని రాజేందర్ కూడా నిర్ణయించుకున్నారు. అప్పటికే పలివెల ఓటర్లు బీజేపీకి అనుకూలంగా మారిన విషయం గుర్తించిన గులాబీ నేతలు దానిని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో మంగళవారం ఈటల ప్రచారం నిర్వహిస్తుండగా అటుగా వచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈటలను గమనించారు.
పల్లా ఆదేశంలో దాడి..
ఈటల ప్రచారం సందర్భంగా పలివెల ప్రధాన కూడలిలో టీఆర్‌ఎస్ నాయకులు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. బీజేపీ నాయకులు అప్పటికే 10 నిమిషాలు ఓపిక పట్టాలని కోరారు. కానీ ట్రాఫిక్‌లో ఇద్దరు జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేతో కలిసి ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈటల కోసం తాము ఆగాలా అని అసహనానికి గురయ్యారు. గ్రామంలోని ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదని తెలుసుకున్నారు. దీంతో బీజేపీ నేతలపై దాడి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన పల్లా ఆదేశంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ చేతిలో ఉన్న జెండా కర్రలతో దాడికి దిగారు. రాళ్లు రువ్వారు. దీంతో బీజేపీ నాయకులు కూడా ప్రతిదాడి మొదలు పెట్టారు. పరస్పర దాడిలో ఇరు వర్గాల నాయులు, కార్యకర్తలు గాయపడ్డారు.
ఈటలపై అక్కసుతోనే దాడి..
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌ను వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున మళ్లీ పోటీచేసి గెలిచారు. ఇక్కడ ఈటలను ఓడించేందుకు గులాబీ బాస్ చేయని ప్రయత్నం లేదు. అయినా టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పలేదు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈటలను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలని కేసీఆర్ భావించారు. మొదటి సమావేశంలో చిన్న కారణం చూపి సస్పెండ్ చేయించారు. రెండోసారి కూడా సభలో లేకపోయినా బయట మాట్లాడిన మాటలు స్పీకర్‌ను కించపర్చేలా ఉన్నాయని సస్పెండ్ చేశారు. మరోవైపు ఈటల రాజేందర్ కేసీఆర్ టార్గెట్‌గానే దూకుడు ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీచేస్తానని సవాల్ చేశారు. కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యం అని పదేపదే చెబుతున్నారు.

కేసీఆర్ గుట్టు తెలిసిన నేత కావడంత..
ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. కేసీఆర్ రహస్యాలు, ఆయన రాజకీయ వ్యూహాలను దగ్గరి నుంచి గమనించిన నేత ఈటల. ఈ క్రమంలో కేసీఆర్‌ను ఎలా దెబ్బకొట్టాలో బీజేపీకి ఉప్పందిస్తున్నారు. బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్‌గా ఉండి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. మునుగోడులో విజయానికి కూడా కేసీఆర్‌ను మించన వ్యూహాలు రూపొందించారు ఈటల. 14 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు మునుగోడులో ప్రచారం చేస్తున్నా.. ఈటల వ్యూహంతో ఓటర్లు గులాబీ వైపు మొగ్గుచూడం లేదు. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే గులాబీ నేతలు చివరి రోజు ఈటలపై దాడికి దిగారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.