
కేంద్రం రాష్ర్టాలకు అందించే ఉచిత కరోనా వ్యాక్సిన్లకు కొత్త మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది. వీటిని పరిశీలిస్తే తెలంగాణకు సరఫరా చేసే వ్యాక్సిన్లలో కోత విధించే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా కేంద్రం అందించే ఉచిత టీకా డోసులను జనాభా వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య ప్రాతిపదికన ఆయా రాష్ర్టాలకు కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై మంగళవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు, వ్యాక్సినేషన్ సమర్థవంతంగా చేపడుతున్న రాష్ర్టాలకు కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. టీకా ల వృథా ఎక్కువగా ఉన్న రాష్ర్టాలకు కేటాయింపుల్లోకోత ఉండవచ్చని హెచ్చరించింది.
నూతన మార్గదర్శకాల ప్రకారం తెలంగాణకు తక్కువగా సరఫరా చేసే అవకాశం ఉందనేది బలమైన వాదన. కరోనా కేసుల సంఖ్య ఆంధ్రతో పోల్చుకుంటే సగానికి సగం కూడా నమోదు కావడం లేదు. అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువ చేయడంతోనే తక్కువ పాజిటివిటీ కేసులను తెలంగాణ ప్రభుత్వం చూపుతోందని ఆ రాష్ర్ట హైకోర్టు అనేకమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం పంజాబ్ లో 1.43 లక్షలు, చత్తీస్ గడ్ లో 1.55 లక్షలు, తెలంగాణలో 2.25 లక్షలు, రాజస్థాన్ లో 4.76 లక్షలు, కేరళలో 6.33 లక్షల డోసులు టీకాలు వృథా అయినట్లు తేలింది. దీంతో తెలంగాణ రాష్ర్టానికి వ్యాక్సిన్లు విషయంలో తక్కువ సరఫరా కావచ్చనేందుకు ఈ లెక్కలన్నీ ముందుకొస్తున్నాయి.