Nara Lokesh Padayatra: తనను తాను నాయకుడిగా మలుచుకునేందుకు.. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్లు నడవనున్నారు. ఇప్పటికే వంద కిలోమీటర్ల మైలురాయి పూర్తిచేశారు. ఇంకా దాదాపు 3,900 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంది. తన రాజకీయ వారసుడిగా లోకేష్ కు అన్ని యోగ్యతలు ఉన్నాయని చెప్పేందుకు చంద్రబాబు పాదయాత్రకు ప్లాన్ చేశారు. షెడ్యూల్ ను ప్రకటించిన నాటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. లోకేష్ శరీర ఆకృతిలో కూడా మార్పు వచ్చేలా ప్రత్యేకంగా వర్కవుట్ చేశారు. లోకేష్ ను అన్నివిధాలా సంసిద్ధుడును చేశారు. అయితే లోకేష్ పాదయాత్రలో ఒక్క ఫ్లేవర్ మిస్సవుతోంది. అదే ఇప్పుడు ప్రతిబంధకంగా మారింది.

వాస్తవానికి లోకేష్ పాదయాత్రను అధికార పక్షం లైట్ తీసుకుంది. దానికి కారణం ఆయన మాటల్లో డొల్లతనం, తత్తరపాటు. పాదయాత్రలో దానినే హైప్ చేసి పలుచన చేయ్యాలని డిసైడ్ అయ్యింది. కానీ అధికార పక్షం ఊహించినంతగా ఆయన ప్రసంగాలేవీ పేలవంగా లేవు. కొన్నిసార్లు బాగానే మాట్లాడుతున్నారు. కానీ నడక, అలసట, జన తాకిడి.,. వీటన్నింటి మధ్య ఆయన స్పీచ్ అక్కడక్కడా గాడిన తప్పుతోంది. దీంతో దీనినే వైసీపీ సోషల్ మీడియా అలుసుగా తీసుకుంటోంది. తెగ ప్రచారం చేస్తోంది. రకరకాలుగా కామెంట్లు పెడుతోంది. అయితే లోకేష్ పాదయాత్ర విషయంలో చంద్రబాబు కూడా ఇదే ఊహించారు. వైసీపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని కూడా అంచనాకు వచ్చారు. అందుకే అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాను అమరావతిలో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా అనునిత్యం పర్యవేక్షిస్తునే ఉన్నారు.
నాడు జగన్ పాదయాత్ర దారిపొడవునా ముద్దులు, పలకరింతలు, సెల్ఫీలతో సాగింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందించింది. అందుకే ఆయన సక్సెస్ ఫుల్ గా యాత్రను పూర్తిచేశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితే కల్పిస్తే లోకేష్ కూడా పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేస్తారన్నది తెలుసు. అందుకే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని సంకల్పించింది. అందుకే దారిపొడవునా ఆంక్షలు విధించింది. పోలీస్ కేసులు నమోదుచేయిస్తోంది. దీంతో ఎక్కడికక్కడే స్థానిక అంశాలపై మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితి లోకేష్ కు ఎదురవుతోంది. ఈ క్రమంలో ఆయన ప్రసంగంలో అక్కడక్కడా తప్పులు దొర్లుతున్నాయి.

పాదయాత్ర ప్రారంభించి దాదాపు పది రోజులు దాటింది. మొదటి రోజు ఉన్నంత ఉత్సాహం, సందడి రోజులు గడిచే కొలదీ తక్కువ అవుతోంది. ప్రారంభం రోజున రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. అటు అనుబంధ విభాగాల ప్రతినిధులు, చివరకు చాలామంది ఎన్ఆర్ఐలు సైతం విచ్చేశారు. దీంతో ప్రారంభం అదిరిపోయింది. అయితే ఆ ఉత్సాహం చివరి వరకూ ఉంచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పై ఉంది.నాటి చంద్రబాబు యాత్రలో రెండు ఫార్ములాలకు పెద్దపీట వేశారు. ఒకటి ప్రచారం, రెండూ జన సమీకరణ. దాదాపు ఏపీలోని అన్ని మీడియా సంస్థలు పాదయాత్ర కవరేజ్ చేసేలా ప్లాన్ చేశారు. పెద్ద చానళ్ల నుంచి సిటీకేబుల్ వరకూ అందరికీ యాడ్లు ఇచ్చేవారు. అటు నియోజకవర్గాల బాధ్యులు జన సమీకరణ చేసేవారు. అందుకు అయ్యే ఖర్చులు అంతా వారే భరించేవారు. కానీ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర అనుకూల మీడియా తప్పించి.. మిగతా వాటిలో కవరేజ్ కావడం లేదు. యాడ్ల రూపంలో ప్యాకేజీ లేకపోవడమే ఇందుకు కారణం.
లోకేష్ విషయంలో జరిగినంత గోబెల్స్ ప్రచారం ఏ నేతపై జరగలేదన్నది సత్యం. చంద్రబాబు రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన నాటి నుంచే అతడిపై వ్యక్తిగత దాడి మొదలైంది. కేవలం చంద్రబాబు తనయుడు అన్న ఒకే ఒక కారణంతో వైసీపీ నేతలు చేసిన విషప్రచారం అంతా ఇంతాకాదు. ఇప్పుడు పాదయాత్రలో ఏకంగా ఆయన్ను ఒక కమెడియన్ తో పోల్చడం మొదలుపెట్టారు. ఆయన డొల్లతనం చూసేందుకే జనాలు వస్తున్నారు తప్ప.. నాయకుడిగా గుర్తించి రావడం లేదని ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అటు వైసీపీ అనుకూల మీడియా సైతం.. ఇంతటితో పాదయాత్ర నిలిపివేస్తే పరువు దక్కుతుంది.. లేకుంటే పాయే అన్న పతాక శీర్షికలో కథనాలు వేస్తోంది. అయితే వీటిన్నింటికీ అలవాటుపడిన లోకేష్ మాత్రం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇంకా దాదాపు ఏడాదికి పైగా ఆయన నడక సాగాల్సి ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ముళ్లు దాటుకొని వెళితే ఆయన గమ్యానికి చేరుకునే చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.