YS Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు. త్వరలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకోనున్నారు. దీంతో వైసీపీలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. ఆమె కాంగ్రెస్ లో చేరిక మాకు నష్టం లేదంటూనే.. దానిని తప్పుపడుతున్నారు వైసీపీ నేతలు. కానీ ఇప్పుడు షర్మిల చేరిక వెనుక చంద్రబాబు ఉన్నారని అనుమానిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక ఉన్న పాత్రలను, పాత్రధారులను బయట పెట్టడం విశేషం. ఆ మధ్యన సాక్షిలో కూడా షర్మిల వెనుక టిడిపి నాయకులు ఉన్నారన్న అర్థం వచ్చే రీతిలో ప్రత్యేక కథనం రావడం విశేషం.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరక ముందు ఇడుపులపాయకు వెళ్లిన సంగతి తెలిసిందే. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం నిశ్చయం కావడంతో తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆహ్వాన పత్రికలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయితే హైదరాబాద్ నుండి ఇడుపులపాయకు వెళ్లిన ప్రత్యేక విమానం బిజెపిలోని ప్రోటీడీపీ నేత సీఎం రమేష్ సమకూర్చినదని సాక్షిలో కథనం వచ్చింది. అలాగే కడప ఎయిర్ పోర్ట్ లో బ్రదర్ అనిల్ కుమార్ తో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి సోదరుడు ప్రత్యేకంగా కలుసుకున్న సందర్భాన్ని కూడా సాక్షిలో ప్రస్తావించారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అదే అనుమానాలను వ్యక్తం చేస్తూ.. షర్మిల వెనుక చంద్రబాబుతో పాటు టిడిపి నాయకులు, జగన్ ప్రత్యర్థులు ఉన్నారని ఆరోపణలు చేయడం విశేషం.
చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి జగన్ ను కేసులు పాలు చేసిన విషయాన్ని కూడా సజ్జల ప్రస్తావించారు. తనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలపడం చంద్రబాబుకు అలవాటైన విద్యగా అభివర్ణించారు. చంద్రబాబు ఎప్పటినుంచో కాంగ్రెస్ తో కాంటాక్ట్ లో ఉన్నారని.. వైఎస్ కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి అభిప్రాయ భేదాలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. ఓ కుట్ర ప్రకారం చంద్రబాబు తనకేం కావాలో మిగతా వాళ్లను కలుపుకొని వెళ్లగలరని కూడా చెప్పుకొచ్చారు. అయినా వైఎస్ షర్మిల ఏ పార్టీలో చేరితే తమకు సంబంధం లేదని.. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదన్నది జగన్ అభిమతమని సజ్జల తేల్చేశారు. కుటుంబం కోసం జగన్ పార్టీ పెట్టలేదన్న విషయం తెలుసుకోవాలన్నారు. మొత్తానికైతే షర్మిల తో సంబంధం లేదంటూనే.. ఆమె కాంగ్రెస్ లో చేరిక వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించడం గమనార్హం.