Ayodhya Temple: అంతా రామమయం.. దేశమంతా రామ నామస్మరణ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం గురించే. ఏ టీవీ చానెల్ పెట్టినా రామాలయ నిర్మాణ ప్రత్యేకతల గురించే. ఏ పత్రిక చదివినా రామాలయం నిర్మాణ విశేషాలే. అయితే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలపాటు కోర్టుల్లో వాదనలు జరిగాయి. చివరకు భవ్య రామ మందిర నిర్మాణం కల సాకారం కాబోతోంది. జనవరి 22న నిర్వహించే రామమందిర ఆలయ ప్రారంభోత్సవానికి ట్రస్టు వాళ్లు అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో ఓ కుటుంబానికి ఆహ్వానం పంపించడం ఇప్పుడు వార్త అయింది. ఎందుకంటే.. ఆ కుటుంబం 70 ఏళ్లుగా రామమందిర నిర్మాణాన్ని కోర్టుల్లో వ్యతిరేకించింది. అయినా రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్టు వారు రామాలయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం పలికారు.
జనవరి 22న ప్రారంభోత్సవం..
మరోవైపు అయోధ్య రామాలయాన్ని జనవరి 22న ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు రాం లల్లా విగ్రహ ప్రతిష్ట జరుగనుంది. ఈమేరకు దేశవ్యాప్తంగా అతిథులను ఆహ్వానిస్తున్న తీర్థక్షేత్ర ట్రస్టు.. ఇందుకు ప్రత్యేక ఆహ్వాన పత్రికలను కూడా సిద్ధం చేసింది. ఈ క్రమంలో రామమందిర ట్రస్ట్ బాబ్రీ మసీదుకు మాజీ పార్టీ హషీం అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీకి కూడా ట్రస్టు ఆహ్వానం పంపించింది. ఆలయానికి భూమి పూజ సమయంలో కూడా అన్సారీని ఆహ్వానించారు.
1949 నుంచి కేసు వాదిస్తున్నా..
రామజన్మభూమి–బాబ్రీ మసీదు వాది హషీం అన్సారీ 1949 నుంచి ఈ కేసును వాదిస్తున్నారు. అయినా అతడు హిందువులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వివాదాస్పద స్థలం కోసం ఇతర ప్రధాన పోటీదారులలో నిర్మోహి అఖారాకు చెందిన రామ్‌కేవల్ దాస్, దిగంబర్ అఖారాకు చెందిన రామచంద్ర పరమహంస్‌తో హషీంకు చివరి వరకు సన్నిహిత స్నేహం ఉంది. హషీం అన్సారీ మరణానంతరం ఆయన కుమారుడు ఇక్బాల్ అన్సారీ బాబ్రీ మసీదు పక్షాన్ని కోర్టులో సమర్పించారు. 2019, నవంబర్ 9న సుప్రీంకోర్టు రామాలయానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఆహ్వానంపై అన్సారీ హర్షం..
రాం లల్లా విగ్రహ ప్రాణప్రతిష్టకు తనకు ఆహ్వానం అందడంపై ఇక్బాల్ అన్సారీ ఆనందం వ్యక్తం చేశాడు. లార్డ్ రాం లల్లా ప్రాంగణానికి వెళ్లి ప్రతిష్టలో పాల్గొంటానని చెప్పారు. అయోధ్యకు వచ్చే అతిథులను స్వాగతం పలకడం కూడా మన ధర్మమేనని పేర్కొన్నారు. తనకు ప్రధాని మోదీని కలవాలని ఉందని అన్సారీ అన్నట్లు తెలుస్తోంది.