Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలైంది. ఇదుకు కారణం ఆ పార్టీ తెలంగాణ సారథే. ఇతరుల కారణంగా పార్టీలో సమస్యలు తలెత్తితే సరిదిద్దాల్సిన నాయకుడే.. ఇప్పుడు రచ్చకు కారణమవుతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్సో.. లేక తనను ప్రమోట్ చేసుకోవాలన్న ఆత్రుతో తెలియదు కానీ, పార్టీ మంచి లైన్‌లో వెళ్తున్న వేళ.. ఇలాంటివి ఇబ్బందిగా, ఆటంకంగా మారే ప్రమాదకరంగా, చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఏం జరుగుతోందంటే..
తెలంగాణలో అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు ఈసారి ఎడ్జ్ ఇస్తున్నాయి. కర్ణాటక తరహా వ్యూహంతో కాంగ్రెస్ కూడా దూకుడుగా ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి మేనిఫెస్టో రూపకల్ప, ఆరు గ్యారంటీ స్కీంలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రచారాన్ని కూడా ప్లాన్ ప్రకారం మొదలు పెట్టింది. ఇప్పటికే మొదటి దశ బస్సుయాత్ర పూర్తి చేసింది. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రితో రెండో విడత బస్సుయాత్ర చేపట్టింది. ఈ సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ తనను సీఎంగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
టిక్కెట్లలో డామినేషన్..
ఇప్పటికే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌పై పూర్తిగా పట్టు సాధించారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులోనూ తన వర్గానికి ఎక్కువగా టిక్కెట్లు ఇప్పించుకున్నారు. అయితే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ప్రకటించేదు. కనీసం ఏ సామాజికవర్గానికి అన్న విషయం కూడా ప్రకటించలేదు. కానీ, రేవంత్‌రెడ్డి తనను సీఎంగా ప్రమోట్ చేయించుకోవడం మొదలు పెట్టారు. ఇందుకు రెండో విడత బస్సుయాత్రను వేదికగా చేసుకున్నారు.
డీకే సమక్షంలోనే..
రెండో విడత బస్సు యాత్రకు ముఖ్య అతిథిగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హాజరయ్యారు. ఈ సంరద్భంగా పగిరిలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సుపై డీకేతోపాటు పీసీసీ చీఫ్, ఇతర నాయకులు, పరిగి కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఉన్నారు. ప్రచారం సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ రేవంత్ సీఎంగా ప్రమాణం చేశాక, రేవంత్ సీఎం అయ్యాక, రేవంత్ ముఖ్యమంత్రిగా తొలి సంతకం అంటూ మూడు నాలుగుసార్లు రేవంతే సీఎం అన్న విషయాన్ని క్లియర్‌గా ప్రకటించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న రేవంత్‌గానీ, పక్కనే ఉన్న డీకే శివకుమార్ గానీ వారించలేదు. ఇది అధిష్టానం నిబంధనలకు విరుద్ధం అని తెలిసినా, రేవంత్, డీకే మౌనంగా ఉండడం పూర్తిగా ప్రమోట్ చేసుకోవడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
అధికార బీఆర్‌ఎస్‌కు దీటుగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ దూకుడుకు ఇలాంటి విషయాలు బ్రేక్ వేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ల మధ్య విభేదాలకు, ఆధిపత్య పోరుకు కారణమైతే పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. మరి టీపీసీసీ చీఫ్ దీనిని ఎలా సమర్థించుకుంటారో చూడాలి.