Dharmapuri Arvind: ఎన్నికల వేళ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేయడం కామన్. ఓటర్లను ఆకట్టుకునేందుకు, గెలిచిన తర్వాత తాము ఏం చేస్తామో ముందుగా చేసే ప్రామిసే మేనిఫెస్టో. అయితే అభ్యర్థులు మేనిఫెస్టో ప్రకటించడం అరుదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంతమంది, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే స్వతంత్రులు ఇలా వ్యక్తిగత మేనిఫెస్టో ప్రకటిస్తారు. కానీ ఇక్కడ నిజామాబాద్ ఎంపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రతినిధి మేనిఫెస్టో విడుదల చేయడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ మేనిఫెస్టోలో ఏముంది.. ఎందుకు బీఆర్‌ఎస్‌కు చిర్రెత్తుకొస్తోంది. ఎందుకు చర్చనీయాంశం అవుతోందో చూద్దాం.
ఓట్ల కోసం కేసీఆర్ బీమా..
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలన్న అలోచనతో సీఎం కేసీఆర్ ఎక్కువ మంది ఓటర్లను ప్రభావితం చేసేలా తెల్ల రేషన్‌కార్డు ఉన్న అందరికీ బీమా వర్తింపజే యాలని నిర్ణయించారు. ఈమేరకు మేనిఫెస్టోలోనూ పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న 93 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డు ఉందని, మళ్లీ గెలిస్తే అందరికీ బీమా వర్తింపజేస్తానని ప్రకటించారు. దీని ప్రభావం రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది ఓటర్లను ప్రభావితం చేస్తుందని కేసీఆర్ ఎత్తుగడ.
అర్వింద్ కౌంటర్ మేనిఫెస్టో..
కేసీఆర్ ప్రకటించిన బీమా స్కీంపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మండిపడుతున్నారు. చనిపోయినాక ఇచ్చే సాయం ఎవడికి కావాలని, బతికి ఉండగానే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 93 లక్షల కుటుంబాల చావు కోరుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే అందరిపేరిట బీమా చేస్తానని అంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తెల్లరేషన్‌కార్డు లేకపోయినా కేసీఆర్, కేటీఆర్, కవితకు తాను బీమా చేయిస్తానని ప్రకటించారు. నిజామాబాద్ మేనిఫెస్టో పేరుతో ఈ బీమా స్కీం ప్రకటించారు. సీఎం కేసీఆర్ సచ్చిపోతే రూ.5 లక్షలు, ఆయన కొడుకు కేటీఆర్ సచ్చిపోతే రూ.10 లక్షలు, ఆయన బిడ్డ కవిత సచ్చిపోతే రూ.20 లక్షల బీమా ఇస్తానని ప్రకటించారు.
మండిపడుతున్న బీఆర్‌ఎస్ నేతలు..
నిజామాబాద్ మేనిఫెస్టోపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. అర్వింద్ సీఎం, మంత్రి, ఎమ్మెల్సీ చావు కోరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి మేనిఫెస్టో ప్రకటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన కొడుకు, కూతురు చావు కోరుకోవడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అర్వింద్ చావు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ చావు కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు గమనించాలని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించాల్సి ఉంది.
అర్వింద్ చావు కోరితే.. సీఎం చావు కోరినట్లే కదా..
ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లు ఎంపీ అర్వింద్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తోపాటు తన చావు కోరుతున్నారన్నది నిజమే అయితే.. 93 లక్షల కుటుంబాలకు బీమా చేస్తానన్న సీఎం కేసీఆర్ కూడా చావు కోరినట్లే కదా. అర్వింద్ మోటుగా చెప్పారంతే. కానీ కేసీఆర్ ప్రకటించిన బీమా పథకం ఉద్దేశం కూడా అదే. చనిపోతేనే ఆర్థికసాయం అందుతుంది. బతికి ఉండగా ఏమీ చేయని సీఎం చనిపోతే సాయం చేస్తాననడం ఏంటన్నది అర్వింద్ ప్రశ్నం అందులో భాగంగానే తాను కేసీఆర్ ఫ్యామిలీకి బీమా చేస్తానని ప్రకటించారు. ఆకోణంలో అర్వింద్ మేనిఫెస్టో కూడా కరెక్టే. మరి దీనిని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.
కేసీఆర్ సచ్చిపోతే 5 లక్షలు, కేటీఆర్ సచ్చిపోతే 10 లక్షలు, కవిత సచ్చిపోతే 20 లక్షలు ఇస్తామని మా పార్టీ మానిఫెస్టోలో పెడతా – నిజామాబాద్ బీజేపీ ధర్మపురి అరవింద్ pic.twitter.com/dOzwi1NJLO
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2023