Homeఆంధ్రప్రదేశ్‌TDP Janasena Alliance: టీడీపీ జనసేన కూటమితో ఏపీలో అధికారం సాధ్యమేనా?

TDP Janasena Alliance: టీడీపీ జనసేన కూటమితో ఏపీలో అధికారం సాధ్యమేనా?

TDP Janasena Alliance: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. అధికార వైసిపి సైతం అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రెండోసారి గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. అటు విపక్షాలు సైతం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన కూటమి కట్టడంతో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. హోరాహోరి పోరాటం తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి. అటు అధికార పక్షం సైతం ఈ కూటమిని చూసి కలవర పడుతోంది.

వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలతోనే గెలుపొందుతామని జగన్ భావిస్తున్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్న దృష్ట్యా.. గుంప గుత్తిగా ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. అయితే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అభివృద్ధి లేదని, చాలా వర్గాలు దగాపడ్డాయని, వారంతా వైసిపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని విపక్షాలు అంచనా వేస్తున్నాయి.అందుకే గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. విశ్లేషణలు సైతం భిన్నంగా వ్యక్తమవుతున్నాయి.

తెలుగుదేశం పార్టీతో జనసేన కూటమి కట్టిన తర్వాత సీన్ సమూలంగా మారింది. అప్పటివరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ బలం పెంచుకునే క్రమంలో చతికిల పడింది. అయితే ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది. దానికి పవన్ చరిష్మ తోడు కావడంతో కూటమి గెలుపుపై నమ్మకం ఏర్పడింది. అంతులేని ప్రజా వ్యతిరేకత, పవన్ చరిష్మ,టిడిపి క్షేత్రస్థాయిలో ఉన్న బలం… కూటమికి ప్లస్ పాయింట్ గా నిలవనున్నాయి.ఇప్పటికే అధికార వైసీపీకి ఉద్యోగులు,ఉపాధ్యాయులు దూరమయ్యారు. వారంతా కూటమికి మద్దతు పలికే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు అమలు కాక.. దగా పడ్డ అన్ని వర్గాల వారు ఓటమి వైపు చూసే అవకాశం ఉంది. వైసిపి ప్రభుత్వ చర్యలతో చాలా వర్గాలు బాధితులుగా మిగిలారు. వారంతా సైతం కూటమికి జై కొట్టే పరిస్థితి ఉంది.

కూటమితో ప్రధానంగా కాపు, కమ్మ సామాజిక వర్గాలు సంఘటితమయ్యే అవకాశం ఉంది. రెండు పార్టీల మధ్య ఈ సామాజిక వర్గాల ఓట్లు బదలాయింపు జరిగితే దాదాపు 70 నియోజకవర్గాల్లో కూటమి సునాయాస విజయం తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి అభ్యర్థులు స్వీప్ చేసే అవకాశం ఉంది. అమరావతి రాజధాని ప్రభావంతో గుంటూరు, కృష్ణాజిల్లాలో వైసిపి వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉత్తరాంధ్రలో సైతం టిడిపి, జనసేనలకు సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన పరిణామాలు సైతం కలిసి రానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా టిడిపి, జనసేన కూటమి పవర్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ అని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version