
జనసేన అధినేత మనసు మార్చుకున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పక్కా వ్యూహాలను ఖరారు చేయడానికి సిద్ధమయ్యారు. ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు సమాలోచనలు చేస్తున్నారు. జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. పట్టున్న ప్రాంతాల్లోనే పోటీ చేయాలని భావిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీని దెబ్బకొట్టాలంటే టీడీపీతో పొత్తే ప్రధానమని పవన్ నమ్ముతున్నారు. దీని కోసం టీడీపీతో జత కట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. పనిలో పనిగా బీజేపీని సైతం ఒప్పించే పనిలో పవన్ నిమ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మిత్రపక్షం అధికారంలోకి రావాలంటే టీడీపీని కలుపుకుని పోవాలని పార్టీ పెద్దల ముందు ప్రస్తావించేందుకు సమాయత్తమవుతున్నారు.
ఓట్లు చీలకుండా ఉండేందుకు పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎలాగూ తన వైపు ఉన్నాయని భావించి మిగతా వర్గాలను కూడా తన వైపు తిప్పుకునేందుకు పవన్ చక్రం తిప్పేందుకు ముందుకు కదులుతున్నారు. వైసీపీకి అడ్వాంటేజీ దక్కకుండా చేసే పనిలో పడ్డారు. అందుకే టీడీపీతో పొత్తుకు సుముఖత చూపుతున్నారు. బీజేపీని ఒప్పించే పనిని తన భుజాలపై వేసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్నిస్థానాల్లో ఓడిపోయింది. పవన్ కల్యాణ్ సైతం రెండు చోట్ల పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కానీ ఈసారి అలా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తక్కువ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాలని భావిస్తున్నారు. బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత కూడా పవన్ ఆలోచనలకు కారణమంటున్నారు.