Nara Lokesh: లోకేష్ భయపడుతున్నాడా? ఏది నిజం?

గతంలో సిబిఐ కేసుల్లో జగన్ అరెస్ట్ అయ్యారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. కొద్ది నెలల పాటు సామాన్య ఖైదీ మాదిరిగానే గడపాల్సిన పరిస్థితి వచ్చింది.

Written By: Dharma, Updated On : September 30, 2023 4:28 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: “సరిగ్గా అదును చూసి జగన్ దెబ్బ కొట్టారు. చంద్రబాబుకు జైల్లో పెట్టించారు. ఆయన కుమారుడు లోకేష్ కు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఆ భయంతోనే లోకేష్ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఢిల్లీలో గడుపుతున్నారు. అరెస్టులకు భయపడే ఈ విధంగా చేస్తున్నారు”.. గత కొద్దిరోజులుగా నారా లోకేష్ పై జరుగుతున్న ప్రచారం ఇది. అయితే నిజంగా లోకేష్ భయపడుతున్నారా? కేసులతో ఆందోళన చెందుతున్నారా? ఢిల్లీలో ఎవరికీ కనిపించకుండా పోతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమేనని.. తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టేందుకేనని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

గతంలో సిబిఐ కేసుల్లో జగన్ అరెస్ట్ అయ్యారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. కొద్ది నెలల పాటు సామాన్య ఖైదీ మాదిరిగానే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అటు తరువాత జైలు నుంచి బయటపడి తన నాయకత్వానికి బీజం వేసుకుంటూ ముందుకు సాగారు. వైసిపి ని ఒక బలీయమైన శక్తిగా మార్చారు. తొలుత విపక్షంలో, తరువాత అధికార పక్షంలో నిలబెట్టారు. అయితే ఈ పరిణామ క్రమంలో ఆయన ప్రయాణం సాఫీగా జరగలేదు. కేసులు చుట్టుముట్టాయి. ఎన్నో రకాల ఇబ్బందులు, సంక్షోభాలు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొంటూ తనను తాను నిరూపించుకుంటూ జగన్ ఈ స్థానానికి చేరుకున్నారు.

రాజకీయాలంటే పూల పాన్పు కాదు. ఈ విషయం లోకేష్ కు తెలిసినట్టు జగన్ కు తెలియదు. చంద్రబాబు బాధితుడు జగన్ కాగా.. దానికి జగన్ తన పగను లోకేష్ పై తీర్చుకున్నారు. లోకేష్ రాజకీయాలకు పనికి రాడు అంటూ ప్రచారం చేశారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని సైతం టార్గెట్ చేశారు. జగన్ కంటే రాజకీయాల్లో లోకేష్ ఎక్కువ అవమానాలు పడ్డారు. అతడి పై పప్పు అనే ముద్ర వేశారు. కానీ వాటన్నింటినీ అధిగమించి తాను ఒక నాయకుడు నేనని నిరూపించుకోవడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. లోకేష్ త్వరితగతిన ఇలా మారడానికి కూడా జగనే కారణం. వైసీపీ నేతలు ఈ తరహాలో విమర్శలు చేయకపోయి ఉంటే లోకేష్ లో ఈ మార్పు ఊహించలేం. ఇప్పుడు తండ్రి అరెస్టుతో పాటు తన చుట్టూ నడుస్తున్న కేసులతో లోకేష్ సైతం జగన్ సరసన చేరారు. జగన్ మాదిరిగానే లోకేష్ కూడా మొండివాడు అని అనిపించుకున్నారు. మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవికి సైతం అర్హత సాధించారు.

లోకేష్ భయపడే రకం కాదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అదే జరిగితే ఆయన ఈనాడు రాజకీయాలకు స్వస్తి పలికి ఉండేవాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ నుంచి నేటి వరకు ఎన్నో రకాల సంక్షోభాలను అధిగమించగలిగారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ఆయన కేసులకు, అరెస్టులకు భయపడి ఢిల్లీ వెళ్లారని ప్రచారం చేశారు. కానీ ఆయన ఢిల్లీలో దర్జాగా ఉన్నారు. తన తండ్రిని కేసుల నుంచి విముక్తి కల్పించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. డిబేట్ లలో సైతం పాల్గొంటున్నారు. ఆయన భయపడి ఢిల్లీలో ఉండిపోయారన్నది అవాస్తవం. లోకేష్ భయపడే రకం కాదని.. భయపెట్టే రకమని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం సరికొత్త ప్రచారానికి దిగుతున్నాయి. మొత్తానికైతే తండ్రి అరెస్టుతో లోకేష్ జాతీయ స్థాయిలో సైతం ఒక రకమైన గుర్తింపు పొందగలిగారు. తనకు భయం లేదని నిరూపించుకున్నారు.