
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై రోజుకో ఆరోపణలు వస్తున్నాయి. మొన్న ఈటల రాజేందర్, ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి. భూకబ్జా కేసులో ఇద్దరు నేతలు ఇరుక్కోవడం టీఆర్ఎస్ మనుగడకు కష్టమే. దీంతో టీఆర్ఎస్ నాయకుల చూపు వీరిపైనే ఉంది. ఈటల రాజేందర్ ను బహిష్కరించిన కేసీఆర్ మల్లారెడ్డిపై ఏ చర్యలు తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రి మల్లారెడ్డిపై ఏ విధమైన నిషేధాలు విధిస్తారో వేచి చూడాల్సిందే.
మంత్రి మల్లారెడ్డిపై ఎన్ఎస్ యూఐ రాష్ర్ట అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మంత్రి ఎంపీ లాడ్స్ నిధులు తన సొంత ఫామ్ హౌస్ రోడ్ల కోసం దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. మంత్రి ఆక్రమణలకు సంబంధించిన చిట్టా తన వద్ద ఉందని కుండ బద్దలు కొట్టారు. ఇటీవల అన్యాక్రాంతమవుతున్న భూములపై విచారణ జరిపిస్తున్న తెలంగాణ సర్కారు మల్లారెడ్డి ఆక్రమించిన భూములపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ లో సర్వే నెంబర్ 72,73లలోని ప్రభుత్వ భూమిలో కోర్టు స్టే ఇచ్చినా లెక్కచేయని మంత్రి అక్రమంగా నిర్మాణాలు చేపడతున్నారని విమర్శించారు. మంత్రి అధికార బలంతో ప్రభుత్వం కళ్లు గప్పి సర్వే నెంబర్ 70లో చెరువు కాలువను కబ్జా చేసి నిర్మాణాలు చేపడతున్నారని తెలుస్తోంది.
గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు సుభాష్ నగర్ ప్రాంతమంతా వర్షపు నీటితో నిండిపోవడంతో మంత్రి చేపట్టిన అక్రమ నిర్మాణాల బాగోతం వెలుగులోకి వచ్చింది. దీనిపై కోర్టు స్టే విధించింది. భవన నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆపాలని సూచించింది. అయినా ఎవరికీ అనుమానం రాకుండా మంత్రి నిర్మాణాలు ప్రారంభించి కోర్టు స్టే ధిక్కరించిన మంత్రి మల్లారెడ్డిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.