Pawan Kalyan- Kodali Nani: ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక వార్త వైరల్ గా మారింది. జనసేన అధినేత ప్రాపకం కోసం వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని పడిగాపులు కాసినట్లు వార్త గుప్పు మంది. ఇందుకు వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుక వేదిక అయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల రాధాకృష్ణ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణాజిల్లాలోని పోరంకిలో రాధాకృష్ణ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు అన్ని రాజకీయ పక్షాల నాయకులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వంగవీటి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ తో పాటు వివిధ రాజకీయపక్షాల ప్రముఖులు హాజరయ్యారు. ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరైనట్లు తెలుస్తోంది. పవన్ తో పాటు రాధాకృష్ణ స్నేహితులు, వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న కొడాలి నాని, ఆయన స్నేహితుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లనేని వంశీ మోహన్ సైతం హాజరయ్యారు. అయితే ఇదే వేడుకలో వారు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనసేన అభిమానుల నడుమ కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ ఇరుక్కుపోయారు.జనసేన అభిమానులతో పాటు టిడిపి శ్రేణులు నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇందులో పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఈ వివాహ వేడుకలకు హాజరవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అభిమానులు హాజరయ్యారు.ఇందులో కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ఇరుక్కుపోయారు.
రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పై విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడంలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. ఒకటి రెండు సందర్భాల్లో పవన్ పై కొడాలి నాని వ్యక్తిగత కామెంట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి పై సైతం కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి రాజకీయంగా దుమారం రాగడంతో కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు టాక్ నడిచింది. అయితే ఇవన్నీ రాజకీయంగా చేసినవే తప్పించి.. పవన్ తో పాటు మెగాస్టార్ కుటుంబం అంటే కొడాలి నాని వంటి వారికి భయంతో కూడిన అభిమానం ఉన్నట్లు తేటతెల్లం అయ్యింది. వంగవీటి రాధాకృష్ణ వివాహంతో ఇది నిజమని తేలింది.
ఈ వివాహ వేడుకలకు పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో.. పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ అభిమాన గణంలో కొడాలి నాని వంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులుగా మారిపోయారు. పవన్ మేనియా ముందు కొడాలి నాని హోదా తేలిపోయింది. ఒకానొక దశలో నూతన వధూవరులను ఆశీర్వదించే క్రమంలో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీని అక్కడున్న వారు పెద్దగా పట్టించుకోలేదు. ముందుగా పవన్ రావడంతో వివాహ ప్రాంగణ వేదికలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పవన్ కోసం అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో కొడాలి నాని సైతం పవన్ ను కలిసేందుకు ప్రయత్నించారని ప్రచారం జరుగుతోంది. పవన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో.. క్యూ లైన్ లో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో కొడాలి నాని తో పాటు పవన్ సైతం వెనక్కి తగ్గాల్సిన అవసరం వచ్చిందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో పవన్ అభిమానుల దూకుడుతో ఒక్కసారిగా కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ మోహన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో జనసేన శ్రేణులు విభిన్నంగా స్పందిస్తున్నాయి. రాజకీయాల్లో బయటకు కనిపిస్తోంది ఒకటని.. లోలోపల జరుగుతుంది వేరని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ పై విమర్శలు చేసిన కొడాలి నాని వంటి వారికి వాస్తవ పరిస్థితి తెలుస్తోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.