
న్యాయవ్యవస్థపై ఏపీ సీఎం జగన్ ఫిర్యాదులపై ప్రకంపనలు రేగుతూనే ఉన్నాయి. బార్ అసోసియేషన్లు ఎక్కడికక్కడ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. తాజాగా.. నేతలపై కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టులో పిల్ వేసిన న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ స్పందించారు.
Also Read: జగన్ లేఖ: అమెరికాలోనూ ప్రకంపనలు.. ప్రవాసాంధ్రులు ఏమనుకుంటున్నారు?
తీవ్రమైన అవినీతి, నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జగన్‌మోహన్‌రెడ్డికి 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, వాటి నుంచి తప్పించుకోవడానికే న్యాయవ్యవస్థను బెదిరించే స్థాయికి తెగించారని అశ్వినీకుమార్ ఫైర్ అయ్యారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకే సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై అభాండాలు వేస్తూ లేఖ రాశారని మండిపడ్డారు. ఇది సాధారణ విషయం కాదని.. హెచ్చరిక సందేశం పంపాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బేబ్డేకి లేఖ రాశారు.
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను వేగంగా విచారించి.. శిక్షపడ్డ వారిని లైఫ్‌టైమ్ రాజకీయాల నుంచి నిషేధించాలని, నేరగాళ్లు రాజకీయ పార్టీలు పెట్టకుండా అడ్డుకోవాలని తాను సుప్రీం కోర్టులో వేసిన పిల్‌ను పక్కదారి పట్టించేందుకే జగన్ ఈ నాటకానికి తెరతీశారని దుయ్యబట్టారు. ఇంకా ఈ విషయమై ఆయన స్పందిస్తూ..
‘ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఏడాదిలోగా విచారించి, శిక్షపడిన వారిని జీవితకాలం ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలని నేను 2016లో పిల్ వేశాను. ఆ కేసులో వాదనలు పూర్తయ్యాయి. జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం దీనికి ఓ విధానాన్ని రూపొందించింది. చట్టసభల సభ్యులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలోగా పూర్తయ్యేలా చూసేలా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక కోర్టులు ఏర్పాటైతే వెంటనే శిక్షపడ్డ రాజకీయ నేతలపై జీవిత కాలం నిషేధం అమలవుతుంది. 2017లో వేసిన మరో పిల్ కూడా త్వరలోనే విచారణకు రానుంది. కోర్టులో శిక్ష అనుభవించిన వారు రాజకీయ పార్టీలను స్థాపించకూడదనేది ఈ పిల్ ఉద్దేశం. అంతేకాకుండా.. బ్లాక్ మనీ, బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్‌లాంటి కేసుల్లో ఉన్న అవినీతిపరులకు వరుస శిక్షలు విధించాలని దాఖలు చేసిన ఇంకో పిల్ కూడా సుప్రీం కోర్టులో ఉంది’ అని చెప్పుకొచ్చారు.
Also Read: చంద్రబాబు చేసిన తప్పునే కేసీఆర్ చేస్తారా?
లేఖ రాయడం, మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా జగన్ న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారని అశ్వినీకుమార్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. న్యాయ, కార్యనిర్వహక వ్యవస్థలను విభజించే లక్ష్మణరేఖలను కూడా ఆయన అతిక్రమించారన్నారు. భవిష్యత్తులో మరెవ్వరూ ఇలా న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఎత్తుగడలు వేయకుండా ఉండేలా గట్టి హెచ్చరిక పంపించాలని సీజేకు విజ్ఞప్తి చేశారు.
Comments are closed.