Jagan Vs Chandrababu: జగన్ ఎందుకలా చేస్తున్నారు? ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఎందుకు పోతున్నారు? ఆ సంగతి ఆయనకు తెలియదా? ప్రెస్టేషన్లో అలా చేస్తున్నారా? చంద్రబాబుపై వరుస కేసులు పెట్టడం దేనికి సంకేతం? ఇలా అయితే ఆయనతో పాటు మనము మునగడం ఖాయం?.. వైసీపీ నేతల అంతరంగం ఇది. కానీ జగన్ కు చెప్పే సాహసం చేయగలరా? జగన్ వారి పెద్దరికాన్ని గౌరవిస్తారా? అంటే వైసీపీలో లేదనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. చంద్రబాబుపై వరుస కేసులు జగన్ కు సంతృప్తి ఇచ్చి ఉండవచ్చు కానీ.. వైసీపీ నేతలకు మాత్రం అది మింగుడు పడడం లేదు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం తో పాటు దాదాపు 6 కేసులు వరకు నమోదు చేశారు. తొలుత స్కిల్ స్కాం, తరువాత ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసు, తాజాగా మద్యం, ఇసుక కుంభకోణాలు.. ఇలా ఆరు వరకు కేసులు నమోదు చేశారు. మరో మూడు కేసులు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇలా వరుస కేసులతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయాలని జగన్ చూస్తున్నారు. కానీ అది మొదటికే మోసం వస్తుందని గ్రహించలేకపోతున్నారు. తిరిగి తనకు చేటు చేస్తుందని గుర్తించలేకపోతున్నారు. అలా చేయడం తప్పని వైసీపీ సీనియర్ నేతలు సైతం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు బెయిల్ దక్కడంతో వైసీపీలో ఒక రకమైన అభద్రతాభావం ఉంది. ఇటువంటి తరుణంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.
74 ఏళ్ల వయసులో చంద్రబాబును 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉంచడాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. వైసీపీ శ్రేణులు మాత్రం సమర్ధించుకుంటున్నాయి. అంతవరకు అది అందరూ ఊహించినదే. కానీ తటస్తులు, రాజకీయాలతో సంబంధం లేని వారు మాత్రం రాజకీయ కక్షతో చేస్తున్న పనిగా చెబుతున్నారు. జగన్ సర్కార్ వైఖరిని తప్పుపడుతున్నారు. మొన్నటికి మొన్న బెయిల్ పై విడుదలైన చంద్రబాబుకు అపూర్వ ఆదరణ దక్కడం వెనుక కారణం అదే. టిడిపి శ్రేణులు రహదారిపైకి వచ్చి స్వాగతం పలికాయి. పనిలో పనిగా ఒకసారి చంద్రబాబును చూసొద్దాం అంటూ రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం రోడ్లపైకి వచ్చారు. దీనికి ముమ్మాటికీ జగన్ వైఖరే కారణం.
ఒకే నేతపై వరుసగా కేసులు పెట్టడం,ఆధారాలు లేకుండా, చార్జిషీ ట్లు నమోదు చేయకుండా కేసులు పెడితే అవి న్యాయస్థానాల్లో నిలబడే అవకాశాలు లేవు. గత నాలుగున్నర సంవత్సరాలుగా విడిచిపెట్టి.. ఎన్నికల ముంగిట పదుల సంఖ్యలో కేసులు పెడితే దానిని ఏమనాలి? జ్యూడిషియల్ వ్యవస్థ దీనిని రాజకీయ కక్షగా గుర్తించి.. అటువంటి కేసులన్నీ నిలిపివేస్తే.. ఎన్నికల అనంతరం చూస్తామని చెబితే.. పూర్తిగా కొట్టివేస్తే.. అందుకు మూల్యం చెల్లించుకునేది ముమ్మాటికి జగనే. నవ్వుల పాలు కావడంతో పాటు ప్రజాక్షేత్రంలో దానికి మూల్యం తప్పదు. అయితే ఈ విషయాలన్నీ వైసీపీలో సీనియర్లకు తెలుసు. అని అధినేతకు చెప్పే సాహసం ఎవరూ చేయడం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు కేసుల విషయంలో జగన్ వెనక్కి తగ్గకుంటే.
. తరువాత పరిణామాలకు జగనే బాధ్యత వహించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.