Botsa Satyanarayana: బొత్సపై జగన్ పొలిటికల్ స్కెచ్

ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లోనూ బొత్స కనిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది. వైసీపీ అభ్యర్థుల జాబితాను సైతం బొత్సనే చదువుతున్నారు.

Written By: Dharma, Updated On : January 9, 2024 12:50 pm

Botsa Satyanarayana

Follow us on

Botsa Satyanarayana: మంత్రి బొత్స కు జగన్ చెక్ చెబుతున్నారా? ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారా? ఆయన కుటుంబంతోనే నిలువరించే ప్రయత్నం జరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పక్కా వ్యూహంతోనే జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ ప్రాధాన్యమిస్తున్నట్లు బొత్సకు నమ్మిస్తూనే.. తెర వెనుక తతంగాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం.

2019 ఎన్నికలు గుర్తున్నాయి కదూ. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను ప్రకటించింది సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటన ఛాన్స్ ధర్మానకు అప్పగించారు జగన్. దీంతో తనకు తిరుగు లేదని ధర్మాన భావించారు. ఎన్నికల్లో గెలుపొందటమే తరువాయి మంత్రిని అవుతానని.. అది కూడా కీలక పోర్టు పోలియో తన చేతుల్లోకి వస్తుందని ధర్మాన సంబరపడిపోయారు. అధికారంలోకి వచ్చారు.. సీన్ కట్ చేస్తే మూడు సంవత్సరాల పాటు ఎమ్మెల్యే గానే ఉండిపోయారు. తాను ఇక మంత్రి కాలేనని నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇంతలో రాజకీయ సమీకరణలు కలిసి వచ్చాయి. జిల్లాలో లెక్కలు మారాయి. దీంతో మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు బొత్స విషయంలో సైతం అదే జరగనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లోనూ బొత్స కనిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది. వైసీపీ అభ్యర్థుల జాబితాను సైతం బొత్సనే చదువుతున్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో ఆయనే చర్చలు జరుపుతున్నారు. అయితే దీని వెనుక ఏదో జరుగుతోందన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి టికెట్ దక్కదని ప్రచారం చేస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా విశాఖ లోక్ సభ స్థానాన్ని బొత్స భార్య ఝాన్సీ లక్ష్మికి కేటాయిస్తారని మీడియాకు లీకులు ఇస్తున్నారు. అయితే అసలు ఈ విషయంపై తనతో జగన్ ఎప్పుడూ మాట్లాడలేదని బొత్స చెబుతున్నారు. అయితే వైసీపీలో రాజకీయం తెలిసినవారు ఇది బొత్సను పక్కకు తప్పించడానికేనని అనుమానిస్తున్నారు.

బొత్సను రాజకీయాల నుంచి తప్పించేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరలేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకున్న ఏకైక అభ్యర్థి కూడా బొత్స సత్యనారాయణ కావడం విశేషం. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు బొత్స. ఆ కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇవ్వడం జగన్ కి ఇష్టం లేదని అప్పట్లో టాక్ నడిచింది. ప్రస్తుతం జిల్లా మొత్తం బొత్స కంట్రోల్లో ఉంది. ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యే గాను, అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యే గాను, సమీప బంధువు అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే గాను ఉన్నారు. అటు మేనల్లుడు చిన్న శ్రీను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం బొత్స అనుచరులే. అందుకే బొత్స విషయంలో జగన్ ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మేనల్లుడు ద్వారా బొత్స ను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే అన్నింటా ప్రాధాన్యమిచ్చి.. రాజ్యసభ ఆఫర్ ఇచ్చి రాజకీయాల నుంచి తప్పించే కుట్ర జరుగుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మోసపోవడానికి బొత్స సిద్ధంగా ఉన్నారా? లేకుంటే ఈపాటికే రాజకీయాన్ని గుర్తించారా? అన్నది తెలియాల్సి ఉంది.