కరోనా మహమ్మారితో ప్రపంచమే కుదేలయిపోయింది. వైరస్ వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. సామాన్యుడి నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరు కూడా బయటకు రావడానికి జంకుతున్నారు. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రజలకు కనిపించడం మానేశారు. అంతా తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచే పని కానిచ్చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు సైతం ఆన్ లైన్ లోనే బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. లైవ్ వీడియో ద్వారానే వారితో ముచ్చట్లు తప్ప మరేమీ లేదన్నట్లుగా సీన్ ఉంది. స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా జగన్ ఎక్కడా కనిపించలేదు.
కరోనా తగ్గుముఖం పట్టాక జగన్ జనాన్ని కలుస్తారని తెలుస్తోంది. జగన్ కు ప్రజలను కలవాలని మనసులో ఉందని మంత్రులు చెబుతున్నారు. ఆయన తపన కూడా ప్రజల కోసమే అంటున్నారు. కరోనా కాలం కాబట్టి ప్రజల వద్దకు వెళ్లడం లేదని సమాచారం. సరైన సమయం చూసుకుని జనంలోకి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే జగన్ కూడా ప్రణాళికతోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజల సమస్యలు వారి మధ్య నుంచి పరిశీలించాలని జగన్ కు కూడా అనిపించింది. కానీ కరోనా మహమ్మారి పడగ విప్పడంతో అడుగు బయట పెట్టలేదు. ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంవత్సరంలో ప్రజల సమక్షంలోనే ఉండాలని భావించినా పరిస్థితులు సహకరించలేదు. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక రచ్చబండకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే సమాచారం వినిపిస్తోంది.
ప్రజలకు కనిపించకుండా ఉండడం కూడా వ్యూహంలో ఒక భాగమే అని చెబుతున్నారు. ఏడాదిన్నర పాటు రాష్ర్టమంతా చుట్టేసిన జగన్ పథకం ప్రకారమే కావాలనే జనం మధ్యకు రావడం లేదని తెలుస్తోంది. ఒక్కసారిగా జనంలోకి వస్తే వారిలో పూనకాలు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో భారీ గ్యాప్ ఇచ్చారని సమాచారం. మొత్తానికి రెండున్నరేళ్ల తరువాత జగన్ జనంలోకి రావడం మరోసారి సంచలనమే అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి జనంలోకి రాకుండా ఉండడమే మార్గమని భావించినట్లు తెలుస్తోంది.