Jagan: తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడంటారు. రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరుగా ఉంటుంది. రాజనీతి దార్శనికుడుగా పేరున్న చంద్రబాబు పాచికలు ఏవీ పారడం లేదు. ఫలితంగా టీడీపీ కష్టాల పాలవుతోంది. వ్యూహాలు రూపొందించడంలో దిట్ట అనే పేరున్నా ఆయన ఆలోచనలు మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా ఆయన గల్లీకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

శకునం చెప్పే బల్లి కుడిదిలో పడుతుందట. చంద్రబాబు విషయంలో కూడా ఇది నిజమే అనిపిస్తుంది. గతంలో బీజేపీ ప్రభుత్వంలో చేరి మంత్రి పదవులు పొంది పొత్తు పెట్టుకున్నా తరువాత కాలంలో దానితో తెగదెంపులు చేసుకుని మోడీ, అమిత్ షాలపై విమర్శలకు దిగారు. దీంతో రెండు పార్టీల్లో సంబంధాలు దూరమయ్యాయి. కానీ ఇప్పుడు అదే పార్టీతో పని పడటం వల్ల ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదని తెలుస్తోంది. ఆయన చేసిన స్వయంకృతాపరాధం వల్లే ఆయనకు నష్టాలు వస్తున్నాయని పలువురి వాదన.
రాష్ర్టంలో జరిగిన గొడవలపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని వెళ్లినా అక్కడ వారి అపాయింట్ మెంట్లు దొరకలేదని ప్రచారం సాగుతోంది. అందుకే రాష్ర్టపతిని కలిసి వినతిపత్రం అందజేసి వచ్చారు. మోడీ, అమిత్ షాలను కలిస్తే పరిస్థితి మరోలా ఉండేది. జగన్ తన పరపతి ఉపయోగించి బాబుకు చాన్స్ దొరకకుండా చేశారనేది మరో వాదన. దీంతో బాబు ప్లాన్లు బెడిసికొడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కానీ జగన్ మాత్రం బాబులా చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో చేరలేదు. అత్యధిక స్థానాలు గెలిచినా బయట నుంచే మద్దతు ఇస్తూ తన పని కానిస్తున్నారు. దీంతో అటు కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు కన్నా జగన్ వ్యూహాలే పక్కాగా ఉంటున్నాయని పలువురు చెబుతున్నారు. కేంద్రంలో బాబుకు అపాయింట్ మెంట్లు దొరకకుండా తాడేపల్లి నుంచే జగన్ రిమోట్ కంట్రోల్ చేశారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బాబుకు మోడీ, అమిత్ షాల నుంచి అనుమతి రాలేదని తెలుస్తోంది. దీంతో రాష్ర్టంలో పరిస్థితులు ఎలా మారతాయో అని అందరు ఆలోచిస్తున్నారు.