
కేసీఆర్ పై పోరాటం చేస్తున్న ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నాడు..? సొంత పార్టీ పెడుతారా..? లేక వేరే పార్టీలోకి మారుతారా..? వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి ‘చేతి’ని పట్టుకోవడానికే సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. రాజకీయాలేమీ మాట్లాడలేదు.. తెలంగాణ పరిస్థితుల గురించి చర్చించామని అంటున్నారు.. ఇద్దరు రాజకీయ నాయకుల కలిసిన తరువాత ఏం మాట్లాడుకుంటారో ఇప్పటి జనానికి తెలియని విషయం కాదు.. అయితే ఈటల కాంగ్రెస్ లోకి వెళ్తాడా..? లేక భట్టి విక్రమార్క మద్దతు కోరుతాడా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చిన తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తరువాత ఎమ్మెల్యే, పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తారని.. సొంత పార్టీ పెడుతారని..రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఏ విషయంపై ఈటల గానీ, ఆయన ఆనుచరులు గాని క్లారిటీ ఇవ్వడం లేదు. ఓ వైపు కరోనా విజృంభించడంతో పాటు ప్రస్తుతం ఎన్నికల సీజన్ కానున్నందున ఆయన నిర్ణయంపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అయితే ఈటల మాత్రం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న నాయకులను కలుస్తూ వస్తున్నారు. వారితో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. పైకీ రాజకీయాలేమీ లేవని చెబుతున్నా కచ్చితంగా భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొనే ఇదంతా చేస్తున్నారని కొందరు అంటున్నారు..
ఇటీవల ఈటల రాజేందర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. టీఆర్ఎస్ నుంచి భయటకు వచ్చిన తరువాత ఈటల కాంగ్రెస్లోనే చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన సొంత పార్టీ పెట్టే ఆలోచనలున్నాయని కొందరు అంటున్నారు. ఫ్యూచర్లో ఈటల ఏం చేసినా ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ కు చెందిన నాయకులను మాత్రం కలుస్తున్నారు. ఇదివరకు కాంగ్రెస్లో ఉండి బయటకొచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా ఈటల ఇంటికి వెళ్లి సానూభూతిని తెలిపారు. ఆయితే ఆయన రాజకీయాలేమీ మాట్లాడలేదని తెలిపారు.
ఇప్పుడు భట్టి విక్రమార్కతో మీటింగ్ పెట్టిన నేపథ్యంలో తెలంగాణలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నవారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఈటల ఇలాంటి సమావేశాలు పెడుతున్నారని అనుకుంటున్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్ ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసినా కేసీఆర్ వ్యతిరేక శక్తులతో కలిసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులందరితో రోజూ మీటింగ్ పెడుతున్న ఈటల త్వరలో ఓ క్లారిటీకి రానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఆయన నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఈటల పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈటల భూ దందాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయనను ఈటల స్థానంలో తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ విషయంపై కూడా భట్టి విక్రమార్కతో మాట్లాడినట్లు సమాచారం. ఏదీ ఏమైనా ఈటల భట్టి విక్రమార్కతో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.