AP- BJP: తెలంగాణ సీఎం కేసీఆర్ అపర రాజకీయ చాణుక్యుడు. ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలిసిన నేర్పరి. ఇలా మునుగోడు ఉప ఎన్నిక ముగిసిందో లేదో.. తన రాజకీయం మొదలు పెట్టారు. తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాలు బీజేపీ బాధిత రాష్ట్రాలుగా చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీ మరో నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కుప్పకూల్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, ఏపీలో ప్రభుత్వాలను పడగొట్టేందుకు కుట్ర పన్నుతోందని కూడా ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఢిల్లీ దూతలు బేరాలు ఆడుతున్న వ్యవహారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది. కొద్దిరోజుల పాటు వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేసీఆర్ మీడియా ముందుకొచ్చి బీజేపీ అగ్రనేతల ప్రమేయాన్ని ప్రస్తావించి కాక పుట్టించారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, న్యాయమూర్తులకు వీడియోలు పంపించినట్టు తెలిపారు. మొత్తానికి బీజేపీ పెద్దల పేర్లు ప్రస్తావించి ఇండియన్ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలనుకున్నారు.

అయితే నాలుగు రాష్ట్రాలపై కుట్ర జరుగుతుందని విశ్లేషించిన తీరే కాస్తా ఎబ్బెట్టుగా ఉంది. అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో అమ్ఆద్మీ పార్టీని చీల్చాలని బీజేపీ చూసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ జాగ్రత్త పడ్డారు. తనంతట తానే విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఆ పరీక్షలో విజయం సాధించారు కూడా. అటు రాజస్థాన్ కాంగ్రెస్ కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. అక్కడ గెహ్లట్, పైలెట్ మధ్య విభేదాలున్నాయి. ఆ విభేదాలను క్యాష్ చేసుకోవడం ఒక రాజకీయ పార్టీగా బీజేపీకి హక్కు ఉంది. ఇప్పుడు తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆహ్వానించి ఉప ఎన్నికకు కారణమవుతోంది. అయితే తాజాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని ఆరోపణలను ఎదుర్కొంటోంది.
అయితే ఎటొచ్చి ఏపీ ప్రస్తావనను కేసీఆర్ తీసుకురావడం మాత్రం వ్యూహాత్మకమే. ఇక్కడ అధికారంలో ఉన్నది వైసీపీ. ఆపై 151 స్థానాలతో పటిష్టంగా ఉంది. అవసరమున్న ప్రతీసారి ఇటు జగన్, అటు కేంద్రం సహకారం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగుతున్నాయి. పైగా బీజేపీకి రాష్ట్రంలో బలం అంతంతమాత్రమే. అంత ఆకర్షణీయమైన నేత కూడా ఆ పార్టీలో లేరు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్ర బాధిత రాష్ట్రాల జాబితాలో ఏపీని చేర్చేశారు. సరైన సమయంలో బీజేపీ రాష్ట్రంలో ఎంటరవుతుందని తొలినాళ్లలో వినిపించినా.. తరువాత ఆ చాన్సే లేదని తేల్చేశారు. ఏపీ విషయానికి వచ్చేసరికి కేవలం ప్రాంతీయ పార్టీలకు సహాయకారిగా మాత్రమే బీజేపీ ఉండే చాన్స్ ఉందని కూడా భావిస్తున్నారు.

కేసీఆర్ తాజా ప్రెస్ మీట్ లో ఏపీపై జాలి చూపించడం మాత్రం ఓకింత ఆశ్చర్యమైనా.. ఆయన పక్కా వ్యూహంతోనే అలా మాట్లాడారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ ధ్యాసంతా తన భారతీయ రాష్ట్ర సమితి విస్తరణపైనే పెట్టనున్నారు. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ముందు తెలుగు రాష్ట్రాల్లో ఇంతో కొంత సత్తా చాటితేనే మిగతా రాష్ట్రాల్లో ఉనికి చాటుకునేది. అయితే విభజన సమయంలో ఏపీ ప్రజల మనసు గాయపడే అనేక వ్యాఖ్యలు, బూతులు మాట్లాడారు. అవన్నీ ఏపీ ప్రజల మనుసులో గుచ్చుకుపోయాయి. అందుకే ఏపీ ప్రజల సానుభూతి పొందేందుకు తాజా అస్త్రం ప్రయోగించారు. కానీ అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.