Gujarat Elections 2022: గుజరాత్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కానుంది. అయితే గుజరాత్ ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మమే. బీజేపీ గత 20 ఏళ్లుగా గుజరాత్ లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గుజరాత్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఇప్పుడు ప్రధాని మోదీ దేశాన్నే ఏలుతున్నారు. మరో గుజరాతీ నేత అమిత్ షా దేశంలో రెండో స్థానంలో ఉన్నారు. బీజేపీలో ఈ జోడు నాయకత్వం మంచి జోరు మీద ఉంది. అటు గాంధీ నడయాడిన నేలలో కాంగ్రెస్ ప్రతిసారి భంగపడుతూ వస్తోంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి హడావుడి చేయడం.. చతికిలపడడం ఆ పార్టీకి అలవాటు అయిపోయింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చింది. గతానికి భిన్నంగా సైలెంట్ ప్రచారంతో గుజరాతీయులను ఆకట్టకుకోవడానికి స్కెచ్ వేసింది. అటు ప్రధాని మోదీ కూడా ఇప్పుడు అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ తనను తిట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తోందని చెప్పడం ద్వారా కాంగ్రెస్ ఏదో చేస్తుందన్న చర్చకు ప్రధానే అవకాశమిచ్చారు.

అయితే దాదాపు రెండు దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ను గుజరాత్ లో నిర్వీర్యం చేయడమనేది సాహసంతో కూడుకున్న పనే. ఇప్పటికీ కాంగ్రెస్ పై చెక్కుచెదరని అభిమానం గుజరాతీయులకు ఉంది. కానీ దానిని తట్టి లేపడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమవుతోంది, అయితే ఈసారి పూర్తిగా పంథా మార్చినట్టుంది. సైలెంట్ క్యాంపయిన్ కు ప్రాధాన్యమిస్తోంది. అయితే పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ బలంగా ఉంది. ఈసారి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్న నేపథ్యంలో గుజరాత్ ఎన్నికల ప్రచారానికి రానట్టే. పూర్తిగా సొంత రాష్ట్ర నాయకులే అన్నీతానై వ్యవహరించాల్సి వస్తోంది. గత ఎన్నికల్లో గుజరాత్ లో కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చింది. అంతకు ముందు బీజేపీకి 115 స్థానాలుండగా.. మూడెంకల సంఖ్యను రెండంకెలకే పరిమితం చేసింది. బీజేపీ 99 స్థానాలకే పరిమితమైంది.
ఈసారి అమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఎన్నికల బరిలో నిలవనుంది. పంజాబ్ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఆ పార్టీ పొరుగు రాష్ట్రమైన గుజరాత్ పై ఫోకస్ పెంచింది. అటు పంజాబ్ ఫార్ములాను అనుసరిస్తూనే.,.ముఖ్యంగా బీజేపీని దెబ్బకొట్టాలని భావిస్తోంది. అచ్చం బీజేపీ మాటలనే చెబుతోంది. హిందుత్వ అజెండాకు దగ్గర పరిణామాలను అనుసరిస్తోంది. అటు ఢిల్లీలో సక్సెస్ అయిన గవర్నమెంట్ స్కీమ్స్ ను గుజరాత్ లో అమలుచేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే ఇవన్నీ వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్ ఆద్మీ పార్టీ ప్రభావం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పై తప్పకచూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సహజంగా ఈ పరిణామాలతో బీజేపీ ముందుగానే మేల్కొంది. ఎట్టి పరిస్థితుల్లో గుజరాత్ ను జారవిడుచుకుంటే ఆ ప్రభావం మోదీపైనా, బీజేపీ భవిష్యత్ విజయాలపై పెను ప్రభావం చూపే అవకాశముండడంతో జాగ్రత్తపడింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు వరుస పర్యటనలతో గుజరాత్ ను చుట్టేస్తున్నారు. కేంద్ర నిధుల్లో గుజరాత్ కు అగ్రతాంబూలం ఇస్తున్నారు. అటు మైక్రో క్యాంపెయిన్ తో హోరెత్తిస్తున్నారు. అయితే గత అనుభవాలను ఉపయోగించుకొని బీజేపీ నాయకులు ముందుకు సాగుతున్నారు. అటు కాంగ్రెస్ కు, ఇటు అమ్ ఆద్మీకి చెక్ చెప్పడానికి అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు. అయితే గుజరాత్ లో గెలుపు గతమంతా ఈజీ కాదని ప్రధాని మోదీ సైతం గుర్తించారు. అందుకే బీజేపీ శ్రేణులను అలెర్ట్ చేసేలా కొన్ని సూచనలు చేశారు.. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.