
Huzurabad Elections: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన హుజూరాబాద్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. పోలీసు భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు సజావుగా సాగాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా మొత్తానికి ప్రశాంతంగానే హుజూరాబాద్ పోరు ముగిసింది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఐదు నెలల నుంచి టీఆర్ఎస్, బీజేపీ హుజూరాబాద్ పైనే దృష్టి పెట్టాయి. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు, తన మంత్రి పదవికి రాజీనామా చేయడం, వెంటనే బీజేపీలో చేరడంతో హుజూరాబాద్‌లో ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే.
హుజూరా‘బాద్ షా’ ఈటలేనా ?
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో ఈటల రాజేందర్ ముందు వరుసలో ఉంటారు. స్వతహాగా పౌల్ట్రీ రైతు అయిన రాజేందర్.. ఉద్యమానికి కొంత ఆర్థిక భరోసాగా ఉన్నారు. 2004 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. అనంతరం 2009లో రెండో సారి హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనేక ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజే ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించారు. రెండో సారి కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజేందర్, ఈ సారి ఆరోగ్య శాఖకు అమాత్యుడిగా ఉన్నారు. కరోనా రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న వేళ ఆయన ఆ శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. కరోనా కట్టడికి తన వంతు పాత్ర పోషించారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వెనువెంటనే వివిధ పత్రికల్లో ఆయనపై వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో ఈటల వద్ద ఉన్న ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ తీసుకున్నారు. దీంతో కొన్ని రోజులు ఎలాంటి బాధ్యతలు లేకుండా కేవలం మంత్రిగానే ఉన్నారు. ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతోందని భావించిన ఈటల.. మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనమా చేశారు. దీంతో పాటు టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కొన్ని రోజులకు బీజేపీలో చేరారు.
అప్పటి నుంచి హుజూరాబాద్ పేరు రాష్ట్రమంతటా మారుమోగింది. ఇక్కడి ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో నిలిచారు. హోరీ హోరీగా ప్రచారం సాగింది. ఈ నెల 30న ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాలో ఉన్నారు. కానీ అక్కడ బీజేపీ జెండా ఎగరబోతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఈటల గెలుపు ఖాయమని అక్కడి ప్రజలు కూడా విశ్వాసంగా చెబుతున్నారు.
ఈటలకు కలిసొచ్చిన అంశాలేంటి ?
టీఆర్ఎస్ ఈటలపై ఎన్ని ఆరోపణలు చేసినా హుజూరాబాద్‌లో మొదటి నుంచి ఈటలకు మద్దతు కనిపించింది. మొదటి నుంచి స్థానికుడనే మంచి పేరు, ఉద్యమ నాయకుడనే గుర్తింపు ఆయనకు కలిసివచ్చినట్టుగా తెలుస్తోంది. స్థానిక ప్రజలకు ఈటలపై ఉన్న అభిమానం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఆయనకు కలిసి వచ్చేలా ఉంది. కేవలం ఈ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం వచ్చిందని, సీసీ రోడ్లు, కాలువ నిర్మాణాలు జరిగాయని హుజూరాబాద్ ప్రజలు భావించారు. కొత్త పనులకు హామీ పత్రం, కొత్త పింఛన్లు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెండో విడత గొర్రెల పంపిణీ లాంటి పనులన్నీ ఈటల రాజీనామా చేయడం వల్లే వచ్చాయని అనుకున్నారు. అందుకే ఈటలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నోట్ల డబ్బుల కట్టలు ఇంటింటికీ చేరినా.. ఓటు మాత్రం ఈటలకే పడినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ గెలిచినా.. ఓడినా ఆ పార్టీకి పెద్దగా నష్టం లేదని, కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రభుత్వానికి తెలియాలని చాలా మంది బీజేపీకి ఓటేసినట్టు తెలిసింది. ఈటల ఆత్మాభిమానం ఫార్ములా కూడా కొంత వరకు పని చేసి ఉండవచ్చు. ఇక అధికారికంగా ఓట్ల లెక్కింపు జరిగిన రోజే నిజమైన హుజూరాబాద్ షా ఎవరనేది తెలియనుంది.