Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు జగన్ లక్ష్యం పూర్తయిందా? తాను అనుకున్నది సాధించగలిగారా? టిడిపి స్పీడ్ కు బ్రేకులు వేయగలిగారా? అంటే మిశ్రమ సమాధానమే వస్తుంది. వాస్తవానికి చంద్రబాబును జైలులో పెట్టాలన్నది జగన్ లక్ష్యం. కానీ అంతకంటే మించి టిడిపి రాజకీయ పర్యటనలకు బ్రేక్ వేయాలన్నది అభిమతంగా తెలుస్తోంది. ఈ విషయంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు. విపక్ష నేతలను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయగలిగారు. చంద్రబాబు అరెస్టుపై టిడిపి శ్రేణులు పోరాడుతున్నాయి. దీంతో ప్రజా సమస్యలపై పోరాడడం లేదని తెలుగుదేశం పార్టీపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ కు కావలసింది కూడా ఇదే.
గత ఆరు నెలలుగా చంద్రబాబు స్పీడ్ పెంచారు. వరుస రాజకీయ పర్యటనలతో బిజీగా మారారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను సందర్శించారు. అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీకి ఒక ఊపు తెచ్చారు. వచ్చే ఆరు ఏడు నెలల పాటు జనం మధ్య మమేకం అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు మినీ మేనిఫెస్టోను ప్రకటించి పార్టీ నేతలను ప్రజల మధ్యకు పంపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే టిడిపి క్యాడర్ను ఇళ్ల నుంచి బయటకు తెచ్చి.. ఓటర్లను అంటిపెట్టుకొని ఉండేలా కార్యక్రమాలు ఖరారు చేశారు. నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలిగారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబును రాజకీయ పర్యటనలోనే ఉండగా నంద్యాలలో అరెస్టు చేశారు. గత 40 రోజులుగా ఈ కార్యక్రమాలను అడ్డుకోవడంలో జగన్ విజయవంతమయ్యారు.
అటు నారా లోకేష్ పాదయాత్రను సైతం అడ్డుకోగలిగారు. తొలి రోజుల్లో ఎలాగైనా అడ్డగించే ప్రయత్నం నేరుగా చేశారు. కానీ ఫెయిలయ్యారు. తప్పుడు ప్రచారంతో పలుచన చేయాలని చూశారు. కానీ అక్కడ కూడా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు. గత 40 రోజులుగా తండ్రి కోసం ఢిల్లీలో లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. దీంతో పాదయాత్రను నిలిపివేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది. ఇది కూడా జగన్ సక్సెస్ ఖాతాలో వేయవచ్చు.
అయితే ఇంతవరకు ఓకే కానీ.. చంద్రబాబు అరెస్ట్ పుణ్యమా అని తెలుగుదేశం గ్రాఫ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల తర్వాత టిడిపి క్యాడర్ బలంగా రోడ్డుపైకి వచ్చి పోరాడింది లేదు. కానీ తమ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ప్రతి నాయకుడు, కార్యకర్త రోడ్డు మీదకు రావడం ప్రారంభించారు. ఇది జగన్ చేసిన ప్రయోజనమేనని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. 74 సంవత్సరాల వయసులో ఆయనకు ఇబ్బంది పెడుతున్న తీరుపై ప్రతి వర్గంలోనూ అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా తట్టస్తులు, విద్యాధికులు ఈ విషయాన్ని బాహటంగానే తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తప్పకుండా తటస్తులు విషయంలో చంద్రబాబు అరెస్ట్ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇది జగన్ తెలుగుదేశం పార్టీకి చేసిన ప్రయోజనంగా చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.