
వెనుకటికి గ్రామాల్లో ఏదైనా ప్రజలకు సమాచారం చేరవేయాలంటే డప్పు చాటింపు వేసేవారు.. టూరింగ్ టాకీస్ లో రాబోయే చిత్రం గురించి సైకిల్ రిక్షాపై వాడవాడలో తిరుగుతూ లౌడ్ స్పీకర్ తో చెప్పేవారు. రేడియోలో వార్తలు వినడానికి గ్రామమంతా సిగ్నల్ ఉండే చోటుకు వచ్చి ఆసక్తిగా వినేది.
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్లు ఉండేవి. తర్వాత ఎస్టీడీ, ఐఎస్టీడీ బూత్ లు వచ్చాక అబ్బో అని సంబరపడ్డం. స్మార్ట్ ఫోన్ రాకతో విప్లవమే వచ్చిపడింది. ఇప్పుడు పాత ల్యాండ్ ఫోన్లు, ఎస్టీడీ, ఐఎస్డీ బూతులన్నీ బంద్ అయిపోయాయి.
చిన్నప్పుడు దూరదర్శన్ లో సినిమాలు, క్రికెట్ వస్తుందంటే అబ్బురపడి చూసేవాళ్లం. కరెంట్ పోతే అరె మళ్లీ చూడలేమని బాధపడేవాళ్లం. కానీ నేడు ఇంటర్నెట్ లో స్మార్ట్ ఫోన్ లో ఎక్కడున్నా లైవ్ లో ప్రోగ్రాంలు చూస్తున్నాం..
ఆధునిక సాంకేతికతలో పాతవన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి పత్రికలకు వచ్చిందన్న అభిప్రాయం జర్నలిస్టు సర్కిల్స్ లో వ్యక్తమవుతోంది. 2020నే పత్రికలకు ముగింపు పలుకుతుందా అన్న అనుమానాలు కులుగుతున్నాయి. ఒక శతాబ్ధానికి పైగా పత్రికలు ఈ వ్యవస్థలో కొనసాగాయి. రాజకీయాలను శాసించాయి.. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు అంపశయ్యపై నిలబడ్డాయి.
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ న్యూస్ పేపర్ కుదేలైంది. ఆర్థికంగా చితికిపోయింది. నిర్వహణ చాలా కష్టమవుతోంది. ఉద్యోగులను తీసేసి.. టాబ్లాయిడ్స్ ఎత్తివేసినా ప్రయోజనం ఉండడం లేదు.
తెలుగులోనే అగ్ర మీడియా అధిపతి తన నంబర్ 1 పత్రికతోపాటు చిట్ ఫండ్ , ఫిల్మ్ సిటీ సహా ఆయన సామ్రాజ్యం అంతా నెలకు రూ.200 కోట్ల రూపాయలు సంపాదించేదట.. ఇప్పుడు కేవలం 20 కోట్లు మాత్రమే వస్తుందట.. అదీ చిట్ ఫండ్స్ ద్వారానే ఫిలింసిటీ, పత్రిక, న్యూస్ చానెల్స్ ద్వారా రూపాయి ఆదాయం లేదట.. ఇక పత్రికను నిర్వహించడం ఏంతమాత్రం తేలికైన విషయం కాదని ఆయన దాదాపు నిర్ణయానికి వచ్చేశాడట..
తెలుగులోనే మరో పత్రిక ఇప్పటికే ఉద్యోగులను తొలగించి జీతాలు సగం కట్ చేసి దాదాపు చాలించుకుంది. టీడీపీ పాలనలో ఏపీ ప్రభుత్వం నుంచి 750కోట్ల దాకా సాపందించిన ఆ సంస్థ ఇప్పుడు డబ్బులున్నా ఉద్యోగులను తొలగించిందని.. ఆ సంస్థకు పత్రికను పునరుద్దరించే ఉద్దేశం లేదని జర్నలిస్టులు చెబుతున్నారు. పత్రికలో ఎన్నో దశలుంటాయి. అవి ఖరీదైనవి.. వార్తల సేకరణ, ఆకట్టుకునేలా ప్రచురణ, పేజీ లేఅవుట్, రూపకల్పన, కొత్త చందాదారులను జోడించడం.. ముద్రణ, పంపిణీ , మార్కెటింగ్.. ఇలా పత్రిక వ్యవస్థ ఎంతో జఠిలమైనది. అందుకే ఇప్పుడు ఏ వార్త పత్రిక కూడా మనుగడ సాగించే పరిస్థితుల్లో కనిపించడం లేదు. కరోనా కాటుకు దాదాపు మూతపడే దశకు చేరుకున్నాయి.
స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చాక ఎవ్వరూ దినపత్రికలను చూసే పరిస్థితి కనిపించడం లేదు. న్యూస్ యాప్ ల ద్వారా అంతా వితిన్ స్పాట్ లో జరిగిన సంఘటనను మరుక్షణమే తెలుసుకుంటున్నారు. తెల్లవారి వచ్చే పత్రికల కోసం ఎదురుచూడడం లేదు.
ఇప్పటికే విదేశాల్లో పత్రికల సర్య్కూలేషన్, వినియోగం తగ్గిపోయి దిగ్గజ పత్రికలు కూడా మూతపడుతున్నాయి. పత్రికల స్థానంలో డిజిటల్ మీడియా ప్రవేశిస్తోంది. తమ డిజిటల్ న్యూస్ వెబ్ సైట్లను మరింత ఆకర్షణీయంగా మలిచి వీక్షకులకు అందించడానికి రెడీ అవుతున్నాయి. రాను రాను పత్రికలు మూతపడి ఈ ఆన్ లైన్ పత్రికలు, న్యూస్ యాప్ లే మనుగడ సాగించే అవకాశాలు లేకపోలేదు.