
లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి బిలియనీర్లు కపిల్ వాద్వానా, దీరజ్ వాద్వానాలను ముంబై నుంచి మహాబలిపురంలోహౌజ్ కు తరలించేందుకు సహాయపడ్డ ఐపీఎస్ ఆఫీసర్ పై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈ కేసులో ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ గుప్తాను లీవ్ పై పంపించారు.
లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి సుమారు 20 మంది సభ్యులు ఫార్మ్‌హౌజ్ కు వెళ్లారు. బుధవారం రాత్రి అయిదు కార్లలో వెళ్లిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారెంటైన్ చేశారు. మహారాష్ట్ర హోంశాఖలో పనిచేస్తున్న ఆఫీసర్ అమితాబ్ గుప్తా.. వాద్వాన్ కుటుంబానికి పాస్ లు ఇప్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి వాద్వాన్ సోదరులు కొన్ని ఫ్రాడ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
ఫ్యామిలీ ఎమర్జెన్సీ కోసం మహాబలిపురం వెళ్తున్నారని, వారికి అనుమతి ఇవ్వాలంటూ ఆయన ఆ లేఖలో రాశారు. అయితే వాద్వాన్ సభ్యులు తమ వంట సిబ్బందిని కూడా వారితో తీసుకువెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఆ కుటుంబంపై పోలీసులు కేసు బుక్ చేశారు. ఇప్పటికే యెస్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్ అవినీతి కేసులో వాద్వానా సోదరులకు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అయితే క్వారెంటైన్ ముగిసిన వెంటనే వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఈ ఘటనలో హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై విచారణ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.