Kolkata Doctor Case: కోల్‌కతా మెడికో హత్య కేసుపై సుప్రీ కోర్టులో విచారణ.. నివేదిక సమర్పించిన సీబీఐ.. రిపోర్టులో సంచలన విషయాలు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కార్‌ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం, హత్యపై ఇప్పటికీ కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. పక్షం రోజులుగా దేశ వ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 22, 2024 4:23 pm

Kolkata Doctor Case

Follow us on

Kolkata Doctor Case: పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీకార్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగి పక్షం రోజులు కావస్తోంది. 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ గటనను మించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికీ కోల్‌కతాలో వైద్య విద్యార్థులు, వైద్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవలే దేశవ్యాప్తంగా వైద్యులు విధులు బహిష్కరించారు. స్టేతస్కోప్‌ పక్కన పెట్టి.. ప్లకార్డులు చేత పట్టుకుని రోడ్లపై నిరసన తెలిపారు. ఇక ఇప్పటికీ కోల్‌కతా, ఢిల్లీలో ట్రైనీ డాక్టర్‌ ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఘటనను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆగస్టు 20న ఈ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్‌ డీవై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కోల్‌కత్తా పోలీసుల తీరును, ఆర్‌జీకార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తీరును తప్పుపట్టింది. డాక్టర్ల రక్షణకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా ఈ ఘటనపై గురువారం(ఆగస్టు 22న) విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో ఈ ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ మధ్యంతర రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఇందులో సంచలన విషయాలను వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంలోని పలు లోపాలను సీబీఐ రిపోర్ట్‌ తీవ్రంగా తప్పుపట్టింది. మరోవైపు.. ఇదే కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా స్టేటస్‌ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.

సుప్రీం కోర్టుకు స్టేటస్‌ రిపోర్టు..
దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవరులో తన స్టేటస్‌ రిపోర్టును అందించింది. ఇందులో ముఖ్యంగా కోల్‌కతా పోలీసుల నిర్లక్ష్యాన్ని సీబీఐ ప్రస్తావించింది. ఇక ఈ కేసులో అనుమానం వచ్చి సీబీఐ విచారణ జరిపిన వారి వివరాలను కూడా ఈ స్టేటస్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక సంఘటనాస్థలానికి భద్రత లేదని.. సీబీఐ పేర్కొంది. సీబీఐతోపాటు కోల్‌కతా పోలీసులు కూడా ఈ కేసు స్టేటస్‌ రిపోర్టును సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. కోల్‌కతాలో ఉన్న సీబీఐ అదనపు డైరెక్టర్, డీఎస్పీ నేతృత్వంలో ఈ రిపోర్ట్‌ను సిద్ధం చేశారు.

ప్రభుత్వంపై సీబీఐ సంచలన ఆరోపణ..
స్టేటస్‌ రిపోర్టులో సీబీఐ బెంగాల్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తాము దర్యాప్తు ప్రారంభించే నాటికి బెంగాల్‌ ప్రభుత్వం సాక్షాధారాలను నాశనం చేసిందని పేర్కొంది. బాధితురాలి మృతదేహాన్ని దహనం చేసిన తర్వాతనే పోలీసులు ఎప్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపింది. బెంగాల్‌ పోలీసులు, ప్రభుత్వంపై అనుమానాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.