
నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి ఎక్కడకు వెళ్లాలో ఎవ్వరికీ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఆ వైరస్ కు గురయ్యే ప్రమాదం ఉన్నదని భయపడుతున్నారు.
అయితే భూ ఆవరణలో ఈ వైరస్ సోకని ఒకే ఒక సురక్షిత ప్రాంతం ఒకటి ఉన్నట్లు అమెరికాలోని నాసా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కేంద్రం ఒక్కటే సురక్షితం అని స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం 164 దేశాలకు కరోనా విస్తరించింది. 2 లక్షల మంది దీని బారిన పడగా దాదాపు 8 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు వైరస్ పై యుద్ధమే చేస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకని సురక్షిత ప్రాంతం ఈ భూమండలం మీదే లేదంటున్నారు నిపుణులు. అయితే భూ సమీప కక్ష్యలో తిరుగుతున్న స్పేస్ స్టేషన్ సురక్షితమంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే, సుమారు ఇరవై ఏళ్లలో ఈ స్టేషన్లోని ఓ ఆస్ట్రోనాట్ కు జలుబు మాత్రమే చేసిందట. ఈ కేంద్రంలో హెల్త్ స్టెబిలైజేషన్ ప్రోగ్రాం కొన్నాళ్లుగా కొనసాగుతున్నందున ఈ కేంద్రానికి వైరస్ సోకే చాన్స్ లేదు. ఈ కేంద్రానికి పంపించే వారికి పది రోజులపాటు అన్ని వైద్యపరీక్షలు చేసిన తర్వాతే వారిని అనుమతిస్తారు.