
కర్నాటక బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మరింత ఎక్కువైనట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను తొలగించాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై కొంత కాలంగా.. అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కన్నడ కాషాయ నేతలు. వేచి చూసే ధోరణిలో ఉన్న ఢిల్లీ పెద్దలు.. సర్దిచెబుతూ వచ్చారు. అయితే.. ప్రస్తుతం పరిస్థితి మారిందని, యెడ్డీని తప్పించే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది.
పరిణామాలు వేగంగా మారుతుండడంతో యడ్యూరప్ప తన వ్యూహాలకు పదును పెడుతున్నట్టు అర్థమవుతోంది. యెడ్డీ వ్యతిరేక వర్గం ఈ మధ్య మరింత దూకుడు పెంచింది. ఆయన్ను పక్కన పెట్టాలంటూ బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. దీంతో.. సీఎం కూడా తన బలాన్ని, వ్యూహాన్ని బహిరంగంగానే చాటాలని చూస్తున్నట్టు సమాచారం.
కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కూల్చి అధికారంలోకి వచ్చిందనే అపవాదును కర్నాటక బీజేపీ ఎదుర్కొంటోంది. అయితే.. పాలన ద్వారా ఈ మచ్చను తుడిపేసుకుందామంటే.. అందుకు కూడా అవకాశం లేకుండా పోయిందనేది విశ్లేషకుల మాట. యడ్యూరప్ప ముఖ్యమంత్రి సీటుపై కూర్చొని ఏడాదిన్నర గడిచింది. కానీ.. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. కర్నాటకలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా అధిష్టానం ఆచితూచి స్పందిస్తోంది.
అయితే.. ఇప్పుడు ఏకంగా యడ్యూరప్ప పదవికి ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ప్రచారం సాగుతోంది. అసంతృప్తి వర్గానికి అధిష్టానం తలొగ్గి, యెడ్డీని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే జరిగితే తాను సైలెంట్ గా ఉండబోనని తన చర్యల ద్వారా చాటుతున్నారని టాక్. సోమవారం తనను సపోర్ట్ చేసే వర్గంతో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తద్వారా.. తన వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో చాటిచెబుతున్నారన్నమాట. అంటే.. ఒకవేళ తనను తొలగిస్తే.. భవిష్యత్ ప్రశాంతంగా ఉండదని పరోక్షంగా చెప్పేందుకే యెడ్డీ ఈ మీటింగులు పెడుతున్నారని అంటున్నారు.
ఈ విధంగా కన్నడ కమలంలో ముసలం గట్టిగానే పుట్టిందని అంటున్నారు. మరి, అధిష్టానం దీన్ని ఎలా డీల్ చేస్తుంది? యడ్యూరప్ప ఎలా ఎదుర్కొంటారు? కొత్త సీఎం వస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.