Internal Differences In Telangana BJP: టీ బీజేపీలో వర్గపోరు.. ‘బండి’కి షాకిచ్చేలా కీలక పరిణామాలు!?

కొంత కాలంగా తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కో ఆర్డినేషన్ లేదనే వార్తలు మొదలయ్యాయి. ఎన్నికలకు సిద్దమవుతున్న సమయంలో పార్టీలో చేరికల పైన ప్రత్యేకంగా శ్రద్ద చూపాలని పార్టీ నాయకత్వం సూచించింది.

Written By: Raj Shekar, Updated On : May 4, 2023 4:03 pm
Follow us on

Internal Differences In Telangana BJP: తెలంగాణ బీజేపీలో అంతర్గత రాజకీయం మరోసారి వేడెక్కింది. బండి సంజయ్ కు తెలియకుండానే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేతల మధ్య సమన్యయ కొరవడింది. తెలంగాణ బీజేపీలోకి కొత్త నేతల చేరిక పై పార్టీ హైకమాండ్ స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. పొంగులేటితో చర్చల కోసం బీజేపీ నేతల టీం సమావేశం కానుంది. దీనిపై బండి సంజయ్ కు సమాచారం లేదు. స్వయంగా ఆయనే ఈ విషయం వెల్లడించడం చర్చనీయాంశం అయింది.

బండికి తెలియకుండానే..
కొంత కాలంగా తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కో ఆర్డినేషన్ లేదనే వార్తలు మొదలయ్యాయి. ఎన్నికలకు సిద్దమవుతున్న సమయంలో పార్టీలో చేరికల పైన ప్రత్యేకంగా శ్రద్ద చూపాలని పార్టీ నాయకత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటిని బీజేపీకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిలో లంచ్ మీటింగ్‌కు నేతలు హాజరుకానున్నారు.

చేరికల కమిటీ చర్చలు..
ఇప్పటికే పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ నేతలు పొంగులేటిని కలిశారు. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు మరికొందరు బీజేపీ నాయకులు నేడు పొంగులేటిని తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. పొంగులేటి పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈటెల నిర్ణయమే ఫైనల్…
బీజేపీ నేతలు పొంగులేటితో సమావేశం పైన తనకు సమాచారం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని సంజయ్ పేర్కొన్నారు. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ రావాలన్నారు. పొంగులేటితో ఈటల బృందం భేటీ విషయమై తనకు సమాచారం లేదన్నారు. తనకు చెప్పకపోవటం తప్పేమీ కాదన్నారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తారని తెలిపారు.

చేరికల గురించి తనకు సమాచారం లేదని బండి సంజయ్ చెప్పటంపై ఇప్పుడు ఈటల రాజేందర్ ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.