Manmohan Singh Passed Away: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజులు చికిత్స పొందిన తర్వాత కోలుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. నిజాయితీకి నిలువెత్తురూపంగా మన్మోహన్ సింగ్ కొనసాగారు. రాజకీయాలలో అజాతశత్రువుగా ఉన్నారు. అందువల్లే అటల్ బిహారీ వాజ్ పేయి కూడా మన్మోహన్ సింగ్ ను తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడిగా ఒక సందర్భంలో పేర్కొన్నారు. దశాబ్దాల పాటు ప్రభుత్వ శాఖలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసిన చరిత్ర మన్మోహన్ సింగ్ ది. ఆర్థిక శాఖ మంత్రిగానూ మన్మోహన్ సింగ్ పనిచేశారు. పది సంవత్సరాలపాటు ప్రధానమంత్రిగా పరిపాలించారు. అయినప్పటికీ ఆయన సాధారణ జీవితాన్ని గడిపారు.. ఉన్నతమైన పదవులను అధిరోహించినప్పటికీ.. కీలక స్థానాలలో పని చేసినప్పటికీ మన్మోహన్ సింగ్ పెద్దగా ఆస్తులు సంపాదించుకోలేదు. ఆయనకు పాత మారుతి 800 కారు ఉంది. ఢిల్లీ, చండీగడ్ ప్రాంతాలలో రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్లు ఉన్నాయి. ఇది మాత్రమే ఆయన సంపాదించుకున్న ఆస్తిపాస్తులు. అంతకుమించి ఆయన వద్ద రూపాయి కూడా లేదు. పైగా తన కుటుంబ సభ్యులను రాజకీయాలలోకి తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. శాసన వ్యవస్థలో వేలు పెట్టనివ్వలేదు. మౌనమునిగా ఉన్న ఆయన.. ఏ వివాదంలోనూ తల దూర్చలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు.
నిజాయితీకి నిలువెత్తు రూపం
మన్మోహన్ సింగ్ తన జీవితం మొత్తం నిజాయితీగా బతికారు. న్యాయం వైపు మాత్రమే నిలబడ్డారు. అక్రమాలను ఎన్నడు ఆయన ప్రోత్సహించలేదు. కార్పొరేట్ల వద్ద కోట్లకు కోట్లు వసూలు చేయలేదు. నిరాడంబర జీవితాన్ని గడిపారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకోలేదు. చివరికి విదేశీ పర్యటనలో కూడా వ్యక్తిగత ఖర్చులకు ప్రభుత్వ డబ్బులను ఉపయోగించలేదు. 1999లో మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటివరకు మన్మోహన్ సింగ్ వివిధ ఉద్యోగాల్లో కొనసాగారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకు అంతగా డబ్బు కూడా ఆయన వద్దలేదు. సమయంలో ప్రముఖ రచయిత కుశ్వంత్ సింగ్ ను రెండు లక్షలు అడిగారు. ఆ డబ్బును కుశ్వంత్ సింగ్ రెండు లక్షల ను మన్మోహన్ సింగ్ కు ఆయన అల్లుడు ద్వారా ఇచ్చి పంపించారు. అయితే ఆ ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ ఓడిపోయారు. ఆ మరసటి రోజు కుశ్వంత్ సింగ్ కు మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి.. ఆయన అనుమతితో ఇంటికి వెళ్లిపోయారు. కుశ్వంత్ సింగ్ ఇచ్చిన డబ్బును ఆయన చేతుల్లో పెట్టి.. నమస్కారం పెట్టారు. ” మీరు డబ్బు ఇచ్చినందుకు థాంక్స్. కాకపోతే అది ఖర్చు కాలేదు.. మీ డబ్బు మీరు తీసుకోండి అంటూ” మన్మోహన్ వెళ్లిపోయారు. అయితే ఈ సందర్భాన్ని కుష్వంత్ సింగ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ” ఆయన నిజాయితీని మాత్రమే నమ్ముకున్నారు. గొప్పగా జీవించకపోయినప్పటికీ.. నిరాడంబరతను అలవర్చుకున్నారు. ఏనాడు కూడా ప్రభుత్వ సొమ్మును వాడుకోలేదు. ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించలేదు. సామాన్యుడి గానే వచ్చారు.. సామాన్యుడి గానే వెళ్లిపోయారు. వ్యవస్థలో జోక్యం చేసుకోలేదు. వ్యవస్థకు అన్యాయం చేయలేదు. అధికారాన్ని కట్టబెట్టిన పార్టీకి.. అధికారాన్ని ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు.. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు.. అలాంటి మనుషులు భిన్నంగా ఉంటారని” ఓ సభలో కుశ్వంత్ సింగ్ వ్యాఖ్యానించారు.