Jangali Maharaj Road Pune: ఒక మోస్తరు వర్షానికే కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన రోడ్లు నాశనమవుతున్నాయి. ఇక వంతెనల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ రోడ్లకు మరమ్మతులు చేయడం.. మళ్లీ వర్షాలకు అవి పాడవడం.. ఇలాగే సాగిపోతోంది. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని తేడా లేకుండా దేశం మొత్తం ఇలానే ఉంది. కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులకు కమీషన్లు ఇవ్వడం వల్ల రోడ్డు పనుల్లో నాణ్యత నేతిబీర అవుతోంది.. ఫలితంగా అనతి కాలంలోనే రోడ్లు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. వర్షాలు కురిసినప్పుడు.. వరదలు సంభవించినప్పుడు రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇటీవల కాలంలో జాతీయ రహదారులు కూడా కోతకు గురవుతున్నాయి. వర్షాల వల్ల సంభవించే వరదలకు నామరూపాలు లేకుండా పోతున్నాయి.
మనదేశంలో రోడ్ల పరిస్థితి ఇటీవలి కాలంలో అధ్వానంగా మారిపోయింది. ప్రభుత్వాలు పంచుడు పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో రోడ్ల బాగు గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేకపోవడం.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఉండడం వల్ల రోడ్లన్నీ గుంతలు గుంతలుగా దర్శనమిస్తున్నాయి. అయితే వీటి మరమ్మతులు ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ.. ఇప్పుడైతే పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. బాగుపడుతుందని నమ్మకం కూడా లేదు. అయితే ఇటువంటి చోట మనదేశంలో రోడ్డు నిర్మించి 50 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇంతవరకు చెక్కుచెదరలేదు. పైగా ఆ రోడ్డు అద్భుతంగా కనిపిస్తోంది.
మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో జంగ్లీ మహారాజ్ రోడ్డు ను 1976లో నిర్మించారు. ఈ రోడ్డు పనులను రికార్డు అనే నిర్మాణ సంస్థ చేపట్టింది. అప్పట్లోనే ఈ రోడ్డు నిర్మాణానికి అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. అత్యంత నాణ్యమైన పదార్థాలను వాడింది. రోడ్డు నిర్మాణ సమయంలోనే 10 సంవత్సరాల వారంటీ కూడా ఇచ్చింది. దాదాపు 50 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆ రోడ్డు ఇంతవరకు చెక్కుచెదరలేదు. పైగా అందంగా దర్శనమిస్తోంది. ఈ రోడ్డుపై రాకపోకలు కూడా భారీగానే సాగుతుంటాయి. అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి గోతులు లేవు. పైగా రోడ్డు నిర్మాణం కూడా అద్భుతంగా కనిపిస్తోంది. ఈ రోడ్డు కు రెండువైపులా వాణిజ్య సముదాయాలు ఏర్పాటయ్యాయి. ఆ సముదాయాలు కూడా భారీగా వ్యాపారం సాగుతూ ఉంటుంది.. ఇక్కడ జన సందోహం అధికంగా ఉంటుంది. ఈ రోడ్డుమీద ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ ఆ రోడ్డు ఇప్పటికీ నాణ్యంగానే కనిపిస్తూ ఉంటుంది.
రోడ్డు నిర్మాణ సమయంలో సుమారు నాలుగు ఫీట్ల వరకు నేలను తవ్వారు. అందులో కంకర వేశారు. ఆ తర్వాత ఇసుకతో నింపేశారు. రెండు పొరలుగా డాంబర్ పరిచారు. ప్రతి సందర్భంలోనూ నీరు నిల్వ లేకుండా చూసుకున్నారు. తద్వారా ఆ రోడ్డు అద్భుతంగా రూపొందింది. ఇదే సమయంలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది.