https://oktelugu.com/

Telangana Assembly Budget Session: అసెంబ్లీలో రెచ్చిపోయిన కోమటిరెడ్డి.. లోపలేస్తాడట..?

అసెంబ్లీ లాబీలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారని తెలిపారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత బీజేపీని ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. కానీ, అవినీతి నేతలను అరెస్ట్‌ చేయడమే తన కోరిక అన్నారు.

Written By: Raj Shekar, Updated On : February 8, 2024 5:51 pm
Follow us on

Telangana Assembly Budget Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 8న ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్‌ సమావేశాలు ఇవి. గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం 11:30 గంటలకు సభ ప్రారంభమైంది. సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ హాజరు కాలేదు. గవర్నర్‌ ప్రసంగం తర్వాత సభను వాయిదా వేశారు. గవర్నర్‌ ప్రసంగంతో పదేళ్లలో జరిగిన విధ్వంసంతోపాటు, తెలంగాణ పునర్నిర్మాణం, ఉద్యోగాల భర్తీ, గ్యారంటీల అమలు, రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి తీసుకునే చర్యలను వివరించారు.

కేటీఆర్, రాజగోపాల్‌రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ
ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేటీఆర్‌ రాజగోపాల్‌రెడ్డిని పలకరిస్తూ ఎప్పుడు మంత్రి అవుతావని అడిగారు. దీనికి స్పందించిన రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. మీలాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్‌ పడుతోందని బదులిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని కేటీఆర్‌ అన్నారు. అయితే తాను మంత్రి అవుతానని తెలిపారు. ఏ శాఖ మంత్రి అవుతారని కేటీఆర్‌ అడిగారు. దీనికి రాజగోపాల్‌రెండ్డి హోం మంత్రి అవుతానని, బీఆర్‌ఎస్‌ నేతలను లోపలేస్తానని తెలిపారు. ఇక ఎంపీగా మీ కూతురు పోటీ చేస్తుందా.. లేక కొడుకు సంకీర్త్‌ పోటీ చేస్తాడా అని కేటీఆర్‌ ఆడిగాడు. దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దని కోమటిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..
ఇక అసెంబ్లీ లాబీలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారని తెలిపారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత బీజేపీని ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. కానీ, అవినీతి నేతలను అరెస్ట్‌ చేయడమే తన కోరిక అన్నారు.

బీఆర్‌ఎస్‌పై తగ్గని కోపం..
ఇదిలా ఉంటే ఈ చర్చపై ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌పై ఇంకా కోపం తగ్గినట్లు లేదని అంటున్నారు. గతంలో రాజగోపాల్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీకి అమ్ముడు పోయాడని కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో అయితే ఇదే అంశాన్ని గులాబీ నేతలు ఎజెండాగా పెట్టుకున్నారు. దీంతో ఆ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. అయితే, తాను కేసీఆర్‌ను ఓడించేందుకే బీజేపీలో చేరానని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఓడిపోయినా.. అవినీతి నేతలను జైలుకు పంపుతామని తెలిపారు.