Vande Bharat Train: రైల్వే శాఖ కూడా వందే భారత్ రైళ్లపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కానీ వాస్త పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వందే భారత రైళ్లల్లో మూత్ర శాలల నిర్వహణ.. మరుగుదొడ్ల పర్యవేక్షణ.. సీట్ల కేటాయింపు.. కల్పించిన సౌకర్యాలపై ప్రయాణికులనుంచి పెద్దగా విమర్శలు లేకపోయినప్పటికీ.. వందే భారత్ రైళ్లలో అందించే ఆహారంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో దీనికి సంబంధించి ప్రయాణికులు రకరకాల పోస్ట్లు పెట్టారు. అందించే ఆహారం నాణ్యంగా ఉండడం లేదని.. పురుగులు వస్తున్నాయని.. తింటే ఇబ్బందిగా ఉంటున్నదని.. ఇలా ప్రయాణికులు రకరకాల ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ భారతీయ రైల్వే నష్ట నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ప్రయాణికులకు అనుగుణంగా ఆహారాన్ని నాణ్యంగా తయారు చేయడం లేదు. దీంతో వందే భారత్ రైళ్లల్లో ప్రయాణం ఓకే గాని.. అందులో పెట్టే తిండి బాగోలేదని ప్రయాణికులు నేరుగానే చెప్పేస్తున్నారు. ఇలా ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల పెరిగిపోవడం.. వందే భారత్ రైళ్లల్లో అందిస్తున్న ఆహార నాణ్యతను చెప్పకనే చెబుతోంది.
సాంబార్లో పురుగులు
తాజాగా మరో ఘటన వెలుగులకు వచ్చింది. వందే భారత రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి సాంబార్లో పురుగులు వచ్చాయి. అతడు తిరునల్వేలి నుంచి చెన్నై బయల్దేరాడు. లిమిటెడ్ హాల్టింగ్ కావడంతో టికెట్ బుక్ చేసే ముందు సాంబార్ రైస్ కావాలని కోరాడు. అతడి అభ్యర్థనకు తగ్గట్టుగానే సాంబార్ అన్నం అందించారు. అయితే ప్యాకెట్ విప్పి చూడగా అందులో పురుగులు కనిపించాయి. దీంతో అతడు రైల్వే శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా రైల్వే శాఖ అంతర్గతంగా విచారణ సాగించి.. ఆ ఫుడ్ డెలివరీ చేసిన కాంట్రాక్టర్ కు 50,000 జరిమానా విధించింది. అంతటితోనే ఈ వ్యవహారం సద్దుమణిగింది. దీనిపై ఆ ప్రయాణికుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు..” వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అని చెప్పారు. గొప్పగా ప్రచారం చేశారు. నేను కూడా అదే స్థాయిలో ఊహించాను. తిరునల్వేలి ప్రాంతం నుంచి చెన్నై బయల్దేరడానికి వందే భారత్ ఎక్కాను. లిమిటెడ్ హాల్ట్ కావడంతో ఫుడ్ ముందుగానే బుక్ చేసుకున్నాను. నాకు ఇచ్చిన ప్యాకెట్ విప్పి చూస్తే పురుగులు ఉన్నాయి. ఇలాంటి ఫుడ్ ఎలా తినాలి.. దీనిపై వినియోగదారుల కోర్టులోనే తేల్చుకుంటానని” ఆ ప్రయాణికుడు సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఐతే ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ ప్రయాణికులకు అందించే ఆహారంలో నాణ్యత పాటించడం లేదని.. ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ కొరవడిందని మండిపడుతున్నారు.
— Naresh Aennam (@NareshAennam) November 18, 2024