Inheritance Tax
Inheritance Tax: వారసత్వ పన్ను విధానం.. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న దీనిని తాము అధికారంలోకి వస్తే భారత్‌లో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ ఇండియన్ ఓవర్‌సీస్ చైర్మన్, సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన శామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అధికార బీజేపీకి కాంగ్రెస్ పార్టీ కొత్త అస్త్రం ఇచ్చినట్లయింది. అయితే దీనిపై శామ్ పిట్రోడాతోపాటు పలువురు సీనియర్లు వివరణ ఇస్తున్నా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఏంటీ వారసత్వ పన్ను..
అమెరికాలో వారసత్వ పన్ను చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం.. ఆ దేశంలో ఎవరైనా 100 మిలియన్ డాలర్ల ఆస్తి సంపాదిస్తే.. అతడి మరణానంతరం ఆ ఆస్తిలో 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 45 శాతం మాత్రమే అతడి వారసులకు చెందుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన చట్టం. సంపాదించిన ఆస్తిలో సగానికిపైగా సమాజం కోసం వదులుకోవాలని ఈ చట్టం చెబుతుంది. సంపాదించిన వ్యక్తికే ఈ ఆస్తి మొత్తం చెందదు. అయితే ఇది అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది.
తనకు నచ్చిందన్న పిట్రోడా..
ఈ చట్టం తనకు బాగా నచ్చిందని శ్యామ్ పిట్రోడా అన్నారు. ఏప్రిల్ 23న ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. గత పదేళ్లలో దేశంలో ఆర్థిక అంతరాలు భారీగా పెరిగాయని చెప్పారు. సందప పంపిణీ అంటే ఒకరి ఆస్తులు లాక్కొని మరొకరికి ఇవ్వడం కాదు. సంపద కేంద్రీకరణ జరుగకుండా పంచడం. అంటే ఏకస్వామ్యాన్ని నిరోధించడం అని వివరించారు. మన దేశంలో కనీస వేతనాలు దక్కడం లేదని తెలిపారు. వారసత్వం పన్ను అమలు చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు..
-వెంటనే అందుకున్న బీజేపీ..
పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ వెంటనే అందుకుంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే దీనిపై విమర్శలు చేశారు. ‘వాళ్లు అధికారంలోకి వస్తే వారసత్వ సంపదను కూడా వదలరట, ‘మీ ఆస్తి.. మీ పిల్లలకు దక్కకుండా చేస్తారట. మంగళ సూత్రాలను కూడా దోచుకుంటారని విమర్శించారు. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజు కుటుంబానికి చెందిన యువరాజుకు సలహాదారుగా ఉన్న వ్యక్తి మధ్య తరగతి వర్గం మరింత పన్ను కట్టాల్సి ఉంటుందని గతంలో అన్నారు. ఇపుుడు మరో అడుగు ముందుకేశారు అని విమర్శించారు. మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులపై కూడా పన్ను వేస్తారట అని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదను మొత్తం ముస్లింలకు దోచి పెడుతుందని ఆరోపించారు. తాజాగా పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మోదీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉండడంతో రాజకీయంగా సంచలనంగా మారాయి.
-ఇండియాలో అమలు సాధ్యమేనా?
ఇక శ్యామ్ పిట్రోడా చెప్పినట్టు వారసత్వ పన్ను భారత్‌లో అమలు చేయడం సాధ్యమవుతుందా.. అంటే కాదనే అంటున్నారు విశ్లేషకులు. ఆసక్తికర చట్టమే అయినా.. దీని అమలును అడ్డుకునేది మొదట రాజకీయ నాయకులే అని పేర్కొంటున్నారు. అలాంటి చట్టం అమలు చేస్తే మొదట నష్టపోయేది రాజకీయ నాయకులు, సంపన్నులే. పేద మధ్య తరగతి కుటుంబాలపైనా ప్రభావం ఉన్నప్పటికి అధిక మొత్తంలో సంపదను సమాజం కోసం వదులుకోవాల్సింది మాత్రం రాజకీయ నేతలు, ఆ పార్టీలకు విరాళాలు ఇచ్చే పారిశ్రామిక వేత్తలు, సంపన్నులు అవుతారు. అయితే ఇలాంటి పన్ను గురించి పార్లమెంటు ఎన్నికల సమయంలో మాట్లాడడం ద్వారా పిట్రోడా కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. పరోక్షంగా బీజేపీ చేతికి కొత్త అస్త్రాన్ని ఇచ్చినట్లయిందని పేర్కొంటున్నారు.
-వక్రీకరించారని వివరణ..
దేశం వ్యాప్తంగా పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన ఉద్దేశాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మీడియా వక్రభాష్యం చెబుతోందని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ చెబుతున్న అబద్ధాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అమెరికా వారసత్వ పన్ను గురించి ఒక ఉదాహరణ మాత్రమే చెప్పానని తెలిపారు.
స్పందించిన జైరామ్..
తాజా వివాదంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్‌రమేశ్ కూడా స్పందించారు. దేశంలో వారసత్వ పన్ను విధించే ఆలోచన తమకు లేదన్నారు. నిజానికి ఇలాంటి పన్నును ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నది బీజేపీ ప్రభుత్వమే అని ఆరోపించారు. గతంలో ఆ పార్టీ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. 1985లో ఎస్టేట్ పన్నును అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ రద్దు చేశారని తెలిపారు.
మొత్తంగా పార్లమెంటు ఎన్నికల వేళ.. శ్యామ్ పిట్రోడా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. పరోక్షంగా బీజేపీకి బలం చేకూర్చాయి.