
Inheritance politics – Modi : వారసత్వ రాజకీయాల మీద నిన్న సికింద్రాబాద్ పర్యటనలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఆదివారం వరుస ట్వీట్లతో భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. గతంలో భారతీయ జనతా పార్టీ చేసిన తప్పులను ఉటంకిస్తూ తూర్పు పట్టారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడిన మోదీ.. వాటి మాటున అనుకూల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
వాస్తవానికి కుటుంబ పార్టీల గురించి మాట్లాడిన ప్రధానమంత్రి.. వారిని ఉటంకిస్తూ “పరివార్” గా సంబోధించాడు. అంతేకాదు ఆ పార్టీలన్నీ అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించాడు..” దేశాభివృద్ధికి కుటుంబ పార్టీలు అడ్డుపడుతున్నాయి.. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి . దర్యాప్తు సంస్థల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాయి. ఇది ఎంతవరకు క్షమించరాని నేరం” అని ప్రధాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. దీనిపై నిన్ననే భారత రాష్ట్ర సమితి నాయకులు స్పందించారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నరేంద్ర మోదీ విషం చిమ్మడానికి వచ్చారంటూ ఆరోపించారు. అంతేకాదు తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్నికల ఏడాది కాబట్టి హడావిడిగా శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. గతంలో తాము అనేక విజ్ఞప్తులు చేశామని, కేంద్రం అసలు పట్టించుకోలేదని వారు వివరించారు.
ఇక ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ స్పందించింది.. కుటుంబ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని చెబుతున్న మోదీ.. గతంలో వాటితో ఎందుకు అంట కాగారని ధ్వజమెత్తింది. అవినీతి, కుటుంబ పాలన కలిసే ఉంటే ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తున్నారో ప్రధానమంత్రి గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది.. మిగతా పార్టీలన్నీ అవినీతికి పాల్పడుతుంటే, జనం వాటిని ఎందుకు గెలిపిస్తున్నారని ప్రశ్నించింది..” ప్రధానమంత్రి నిన్న సికింద్రాబాద్లో చాలా ఘాటుగా మాట్లాడారు.. అవినీతి, కుటుంబ పాలన కలిసే ఉంటాయని అన్నారు. పంజాబ్ లో అకాలీలు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్, హర్యానాలో చౌతాలాలు, జమ్మూ కాశ్మీర్లో ముఫ్తీలు, మహారాష్ట్రలో ఠాక్రే లతో భారతీయ జనతా పార్టీ సహవాసం చేసింది. మరి వీటిని వారసత్వ రాజకీయాలు అనరా? అవి కుటుంబ పార్టీలు కావా? అప్పుడు ఏమైంది భారతీయ జనతా పార్టీ విజ్ఞత? ప్రధాని విమర్శలు చూస్తుంటే ఆయనను ఆయనే తిట్టుకుంటున్నట్టు ఉంది” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ ఆరోపించారు.
ఇక నిన్న మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అధికార బిజెపి, ప్రతిపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నయ్. మోదీ నీతులు చెప్పడం తగ్గించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు అంటూ ఉంటే.. దేశానికి ప్రతిపక్ష పార్టీలో ద్రోహం చేస్తున్నాయని అధికార బిజెపి అంటున్నది. ఇలా ఒకరి తప్పులను మరొకరు బయట పెడుతుండటంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నది.