Infosys Restroom Scandal: అతడి పేరు స్వప్నిల్ నగేష్ మాలి.. వయసు 28 సంవత్సరాలు ఉంటుంది. ఇతడిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. వాస్తవానికి నేటి రోజుల్లో సంస్థలు అడ్డగోలుగా కోతలు విధిస్తుండడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. కానీ ఇతడు తన స్వయంకృతాపరాధం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయితే ఇతడు చేసిన పని ఇన్ఫోసిస్ కంపెనీలోనే సంచలనం సృష్టించింది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..
స్వప్నిల్ నగేష్ మాలి బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో పనిచేస్తున్నాడు. ఇతడు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఆడవాళ్లు బాత్ రూం వెళ్ళినప్పుడు.. రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. ఇటీవల ఆ కంపెనీలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి రెస్ట్ రూమ్ కి వెళ్ళింది. అదే సమయంలో పక్క గదిలో ఇతడు ఉన్నాడు. ఆ గదిలో ఉన్న టాయిలెట్ కమోడ్ ఎక్కాడు. ఆ మహిళా ఉద్యోగి రెస్ట్ రూమ్ లో ఉండగా తన ఫోన్ ద్వారా వీడియో చిత్రీకరించాడు. అయితే ఆ వీడియో చిత్రీకరిస్తున్న నేపథ్యంలో.. కెమెరా ప్రతిబింబం వాష్ రూమ్ తలుపు మీద కనిపించింది. దీంతో వెంటనే ఆ మహిళా ఉద్యోగి కంగారు పడింది. ఆ తర్వాత తనను ఎవరో రహస్యంగా వీడియో తీస్తున్నారని గుర్తించింది. వెంటనే పక్క రూమ్ లో ఉన్న వ్యక్తి ఇలా చేస్తున్నాడని గమనించి అతడిని పట్టుకుంది.. వెంటనే మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేసింది.
మహిళా ఉద్యోగి ఫిర్యాదు నేపథ్యంలో ఇన్ఫోసిస్ కంపెనీ అంతర్గత విచారణకు ఆదేశించింది. ఆ కంపెనీ మానవ వనరుల విభాగం అంతర్గత విచారణ నిర్వహించడంతో మాలి పాడు పనిచేశాడని తేలింది. కేవలం ఆ ఉద్యోగిని వీడియో మాత్రమే కాకుండా.. ఏకంగా 30 మంది మహిళా ఉద్యోగులను ఇలా వీడియోలు తీశాడని తేలింది.. అయితే ఇంత జరిగినప్పటికీ ఇన్ఫోసిస్ ఆ మహిళా ఉద్యోగికి క్షమాపణలు మాత్రమే చెప్పింది. ఆ తర్వాత ఈ విషయాన్ని అంతటితో వదిలేయాలి అన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. ఆ మహిళా ఉద్యోగి జరిగిన విషయాన్ని తన భర్తతో చెప్పడంతో.. అతడు ఇన్ఫోసిస్ కంపెనీ ఎదుట నిరసనకు దిగాడు. దీంతో ఈ విషయం మీడియాలో పడి సంచలనంగా మారింది. ఫలితంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆ మహిళా ఉద్యోగి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మాలిని అరెస్టు చేశారు.
Also Read: చైనా ప్రతీకారం ఇలా కూడా ఉంటుంది.. భారత్ లో ఐఫోన్ కు అడుగడుగునా కష్టాలే!
వాస్తవానికి ఇన్ఫోసిస్ కంపెనీలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కాకపోతే రెస్ట్ రూమ్ లలో సీసీ కెమెరాలు ఉండవు. ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఆ వ్యక్తి.. రహస్యంగా వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. ఏకంగా 30 మంది మహిళా ఉద్యోగుల వీడియోలు తీసి తన ఫోన్లో భద్రపరిచాడు. మానవ వనరుల విభాగం అంతర్గత విచారణలో ఈ విషయం వెళ్లడైంది.. అయితే మాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఈ ఉదంతంతో ఇన్ఫోసిస్ కంపెనీ అప్రమత్తమైంది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంతవరకు రెస్ట్ రూమ్ లోకి స్మార్ట్ ఫోన్లు తీసుకువెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.