Kashmir: ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత అత్యంత సున్నిత రాష్ట్రమైన జమ్ము కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడినట్టు కనిపించింది. సరిహద్దుల వెంట సైన్యాన్ని భారీగా మోహరించడంతో చొరబాట్లు ఆగిపోయాయి. ఇదే సమయంలో కాశ్మీర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులను ఆహ్వానించడంతో పలు సంస్థలు అక్కడ తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.. ప్రభుత్వం కూడా రవాణా వ్యవస్థకు ఊతం ఇస్తోంది. వేలాది కోట్లు ఖర్చు చేస్తుండడంతో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పరిణామాలతో కాశ్మీర్ సరికొత్త చరిత్రను లిఖిస్తోంది అని అందరూ అనుకున్నారు.. కానీ రక్తదాహానికి మరిగిన ఉగ్రవాదులు అనంత్ నాగ్, ఉరి, బారా ముల్లా ప్రాంతాలలో సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. పాకిస్తాన్ నుంచి అక్రమంగా సరిహద్దుల మీదుగా చొరబడుతున్నారు. ఫలితంగా శాంతి భద్రతలకు విగాథం కలుగుతోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
చొరబాటు, ఏరివేత
ఓవైపు చొరబాటు యత్నాలు.. మరోవైపు ఏరివేత ఆపరేషన్లు.. ఇంకోవైపు పాకిస్థాన్ కాల్పులు. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితి ఇది. ఈ క్రమంలో బారాముల్లా జిల్లా యురి సెక్టార్‌లో శనివారం తెల్లవారుజామున భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. సైన్యం కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం నలుగురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంట మాటు వేసి.. భారత్‌లోకి ప్రవేశించే యత్నంలో ఉన్నారన్న సమాచారంతో సైన్యం, కశ్మీర్ పోలీసులు, నిఘా వర్గాలు సంయుక్త ఆపరేషన్‌కు దిగాయి. ఎల్‌వోసీని దాటేందుకు చూస్తుండగా సైన్యం కాల్పులు జరిపింది. రాకెట్ లాంచర్లు, ఇతర భారీ ఆయుధాలను ఉపయోగించింది. రెండు గంటలపాటు సాగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు చనిపోయారు. ఇద్దరి మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాక.. మూడో ఉగ్రవాది మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉండగా సమీపంలోని పాకిస్థాన్ పోస్ట్ నుంచి తమపై కాల్పులు జరిపారని భారత ఆర్మీలోని చినార్ కార్ప్స్ పేర్కొంది. యురి సెక్టార్‌లో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపింది.
నాలుగో రోజు ఏరివేత ఆపరేషన్
కాగా, అనంతనాగ్ జిల్లాలో చేపట్టిన ఏరివేత ఆపరేషన్ నాలుగో రోజూ కొనసాగింది. మంగళ, బుధవారాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు చనిపోయిగా, ఇద్దరు లేదా ముగ్గురు పీర్‌పంజాల్ పర్వతాల్లోకి పారిపోయారు. వీరికోసం సైన్యం తీవ్ర గాలింపు చేపడుతోంది. హెలికాప్టర్లను వినియోగిస్తోంది. కొకెర్‌నాగ్ ఏరియాలోని గడోల్ అటవీ ప్రాంతంలో డ్రోన్ సర్వే చేపట్టి ఉగ్రవాదులు నక్కినట్లు అనుమానం ఉన్న ప్రాంతాలపై మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తోంది. నార్తర్న్ ఆర్మీ కమాండర్ ఉపేంద్ర ద్వివేది శనివారం పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం ఉదయం ఆయన ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు.
డ్రోన్‌తో ఉగ్రవాది తరలింపు
ఇప్పటివరకు డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరాకు పరిమితమైన లష్కరే కొత్త ఎత్తులు వేస్తోంది. ఈ ఉగ్ర సంస్థ.. 70 కిలోల బరువును మోయగల డ్రోన్‌ను ఉపయోగించి గత నెలలో ఓ ఉగ్రవాదిని పంజాబ్‌లో విడిచిపెట్టినట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కశ్మీర్‌లోనూ ఇదే ప్రణాళికను అమలు చేసే యోచనలో ఉందని వివరించాయి. డ్రోన్లు 60 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం ఉన్నవి. పంజాబ్‌లో విడిచిన ఉగ్రవాదికి స్థానికులతో కలిసిపోయేలా శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Infiltration attempts on one side on the other hand erivetha what is happening in kashmir
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com