Indian Oil announces Flag Collection Drive : దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య వజ్రోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. అద్భుతమైన 75 సంవత్సరాల భారతాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యక్రమాలు.. ప్రచారాలు జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధానమైనది ‘హర్ ఘర్ తిరంగ’ (ఇంటింటిపై జాతీయ జెండా). ఇందులో త్రివర్ణ పతాకాలను కొనుగోలు చేసి తమ ఇళ్లు, కార్యాలయాల్లో ఎగురవేయాలని ప్రధాని మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఇంతలో జెండాలను ఎలా మడవాలి? ఎలా భద్రపరచాలి అనే సందేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇప్పుడు జెండాలను ఇంటిపై ఎగురవేసిన జనాలు వాటిని ఏం చేయాలన్న సందేహంలో పడ్డారు. అందుకే ఈ జాతీయ జెండాలపై కీలక ప్రకటన చేసింది ఇండియన్ ఆయిల్ పెట్రోలియం సంస్థ. మీ ప్రదేశాలలో త్రివర్ణ పతాకాలను ఏమి చేయాలో కూడా మీరు ఆలోచిస్తున్నట్లయితే ఇలా చేయడం ద్వారా జాతీయ జెండాలను తిరిగి గౌరవించినట్లు అవుతుంది. పడవేస్తే అవమానం కాబట్టి వాటిని భద్రపరచాల్సిన అవసరం ఉంది.
ఇండియన్ ఆయిల్ ఈ క్రమంలోనే జాతీయ జెండాల కలెక్షన్ డ్రైవ్‌ను ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ ముంబై విభాగం వారు ప్రతీ ఇంటిపై ఎగురవేసిన జాతీయ జెండా సేకరణ డ్రైవ్ ను చేపేట్టారు. సంస్థ నిర్వహించే సమీపంలోని పెట్రోల్ పంపుల వద్ద ఇకపై ఉపయోగంలో లేని జెండాలను తిరిగి ఇవ్వాలని వారు పౌరులందరినీ అభ్యర్థించారు.
త్రివర్ణ పతాకాలను సేకరించేందుకు ఎన్జీవో మై గ్రీన్ సొసైటీ కూడా ముందుకొచ్చింది. ముంబైకి చెందిన మరో ఎన్జీవో, మై గ్రీన్ సొసైటీ, మిడ్-డే ప్రకారం ముంబై -థానేలోని నివాస సముదాయాల నుండి త్రివర్ణ పతాకాలను సేకరించేందుకు ముందుకొచ్చింది. ఫ్లాగ్ కోడ్ ప్రకారం జెండాను జాగ్రత్తగా చూసుకుంటామని ఎన్జీవో హామీ ఇచ్చింది. దెబ్బతిన్న వాటిని కోడ్ పేర్కొన్న విధంగా నిర్వీర్యం చేస్తామని హామీ ఇచ్చింది. జాతీయ జెండాలను తిరిగి ఇచ్చేయాలనుకునే వారు 9820099022 / 9167761697 వాట్సాప్ నంబర్లలో సంప్రదించాలని సూచించింది.