భారత నావికాదళంలో కరోనా కలకలం చెలరేగింది. నేవీలోని 26 మంది సెయిలర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ముంబైలోని ఐఎన్‌హెచ్‌ఎస్ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి వీరిని క్వారంటైన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇండియన్ నేవీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. సెయిలర్స్ తో కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు.
ఈ సందర్భంగా నేవీ ఒక అధికారిక ప్రకటన చేసింది. యుద్ధ నౌకల్లో ఉన్న అధికారులు, సెయిలర్లు ఎవరికీ కరోనా రాలేదని వెల్లడించింది. ప్రస్తుతం కరోనా బారిన పడిన సెయిలర్లంతా ఒడ్డున (ఐఎన్ఎస్ యాంగ్రే షోర్ బేస్డ్ డిపో) ఉన్నవారేననని తెలిపింది. లాజిస్టిక్స్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ విభాగాల్లో వీరు విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పింది. సెయిలర్లకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ భాగం అసింప్టొమేటిక్ (ఇన్ఫెక్షన్ లక్షణాలు కనపడని) అని తెలిపింది. కేసులు బయటపడిన వెంటనే బ్లాకు మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ లో ఉంచారు.
ఐఎన్‌ఎస్ అంగ్రే నావల్ బేస్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి ఏప్రిల్ 7 న కరోనా సోకినట్టు నిర్ధారణ. అతని ద్వారానే తాజాగా మిగతా వారికి కరోనా వ్యాప్తి జరిగినట్టు నేవీ ఉన్నతాధికారుల అనుమానం. నేవీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐఎన్‌ఎస్ అంగ్రేను లాక్‌డౌన్ చేశారు. మిగతా సిబ్బందికి కరోనా వ్యాపించకుండా భారత నావికాదళం చర్యలు చెపట్టింది. భారత త్రివిధ దళాలలో ఇప్పటికే ఇండియన్ ఆర్మీలో 8 కరోనా కేసులు నమోదు అయినట్లు సమాచారం.