Homeఅంతర్జాతీయంVivek Ramaswamy: కేరళలో జననం.. అమెరికాలో వ్యాపారం.. అధ్యక్ష పదవి కోసం బరిలోకి..ఎవరీ వివేక్ రామస్వామి

Vivek Ramaswamy: కేరళలో జననం.. అమెరికాలో వ్యాపారం.. అధ్యక్ష పదవి కోసం బరిలోకి..ఎవరీ వివేక్ రామస్వామి

Vivek Ramaswamy: అమెరికా ఉపాధ్యక్షురాలుగా భారత మూలాలు ఉన్న కమలా హరీస్ వ్యవహరిస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నే ప్రతి నిర్ణయంలోనూ ఆమె కీలకంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె ప్రత్యర్థి పార్టీలోని ఒక వ్యక్తి కూడా అధ్యక్షుడయ్యే స్థాయికి ఎదిగాడు. భారత మూలాలు ఉన్న ఈ వ్యక్తి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, పరిక మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు నిద్రలేని రాత్రులు పరిచయం చేస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరు? భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అమెరికాలో ఆ స్థాయికి ఎలా ఎదిగాడు?

క్రమంగా దూసుకుపోతున్నారు

అమెరికా అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్‌ పార్టీలో పోటీపడుతున్నవారిలో భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి క్రమంగా దూసుకుపోతున్నారు. తాజాగా ఎమెర్సన్‌ కాలేజీ వద్ద నిర్వహించిన పోలింగ్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 56 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో రామస్వామి, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డేశాంటిస్‌ 10 శాతం చొప్పున ఓట్లతో పోటాపోటీగా నిలిచారు. అయితే, రామస్వామి మద్దతుదారుల్లో అత్యధికులు(దాదాపు సగం మంది) ఆయనకే ఓటు వేస్తామని గట్టిగా చెబుతుండగా, డేశాంటిస్‌ మద్దతుదారుల్లో మాత్రం తడబాటు కనిపిస్తోంది. డేశాంటిస్‌ మద్దతుదారుల్లో 3వ వంతు మంది మాత్రమే ఆయనకు ఓటు వేస్తామని దృఢంగా చెబుతున్నారు. జూన్‌లో నిర్వహించిన పోలింగ్‌లో 21 శాతం ఓట్లు సాధించిన డేశాంటిస్‌ తాజా పోలింగ్‌లో 10 శాతం
ఓట్లకు పడిపోవడం గమనార్హం. మరోవైపు రామస్వామికి 2 శాతం ఓట్లు పెరగడం విశేషం. పోస్టుగ్రాడ్యుయేట్‌ ఓటర్ల మద్దతు రామస్వామికి పెరుగుతోందని, వారిలో 17 శాతం మంది ఆయనకు మద్దతుగా నిలిచారని ఎమెర్సన్‌ కాలేజ్‌ పోలింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్పెన్సర్‌ కింబల్‌ చెబుతున్నారు. ట్రంప్‌ మొదటి స్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా రెండో స్థానంలో దూసుకుపోతున్న రామస్వామికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై పోటీలో నిలిచే అవకాశం ఆయనకే ఉంటుందని భావిస్తున్నారు.

కేరళ నుంచి వచ్చిన దంపతులకు జననం..

38 ఏళ్ల వయసున్న రామస్వామి భారతదేశంలోని కేరళ నుంచి వలస వచ్చిన దంపతులకు ఒహియోలో జన్మించారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో బయోలాజికల్‌ డిగ్రీ, యేల్‌ యూనివర్సిటీలో లా పూర్తిచేశారు. తొలుత బయోటెక్‌ సంస్థను స్థాపించిన రామస్వామి గతేడాది ఒక ఆస్తి నిర్వహణ సంస్థను ప్రారంభించారు. ‘వోక్‌ ఇంక్‌’ సహా అనేక పుస్తకాలను ఆయన రచించారు. ఆ పుస్తకాల ద్వారానే ఆయన అనేకమందికి పరిచయమవుతున్నారు. పాలనా అంశాలతోపాటు కంపెనీల విధానాలు, వాతావరణ, సామాజిక అంశాలనూ ప్రస్తావిస్తుండటం ఆయన ప్రచారంలో సానుకూలంగా మారింది. ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ వెక్స్‌నర్‌ మెడికల్‌ సెంటర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అపూర్వను రామస్వామి వివాహం చేసుకున్నారు.

రామస్వామి ఆశాజనక అభ్యర్థి: మస్క్‌

టెస్లా, ట్విటర్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా రామస్వామికి మద్దతు ప్రకటించారు. ‘రామస్వామి చాలా ఆశాజనక అభ్యర్థి’ అని మస్క్‌ ట్వీట్‌ చేశారు. రామస్వామి యుద్ధాలకు, వలసలకు వ్యతిరేకి. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలుకుతానని కూడా రామస్వామి చెప్పారు. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్‌ దేశానికి మిలటరీ సాయాన్ని 2028 తర్వాత అమెరికా నిలిపివేయాలని రామస్వామి తేల్చిచెప్పారు. ఇజ్రాయిల్‌కు 38 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ అమెరికా సాయం ఆ ఏడాదితో ముగియనుంది. అమెరికాలో మత స్వేచ్ఛను తాను కాపాడతానన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని అని, అత్యుత్తమ నాయకుడని ఒక ఇంటర్వ్యూలో రామస్వామి కొనియాడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారంగా మారిన ఎఫ్‌బీఐ, ఐఆర్‌ఎస్‌, అణు నియంత్రణ కమిషన్‌ తదితర అనేక ఫెడరల్‌ సంస్థలను మూసివేస్తానని కూడా ఆయన ప్రతినబూనారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular