Bigg Boss 7 Telugu: రవి శివ తేజ యూట్యూబ్ ప్రేక్షకుల పరిచయం అక్కర్లేని పేరు. ఈ యువ నటుడు ఏకంగా 400లకు పైగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. ఈ మధ్య సినిమాల్లో బిజీ అవుతున్నాడు. లేటెస్ట్ రిలీజ్ ఉస్తాద్ మూవీలో హీరో శ్రీసింహ ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తాడు. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి శివతేజ తమ మూవీలో కంటెంట్ ఉన్నప్పటికీ భోళా శంకర్, జైలర్ వంటి భారీ చిత్రాల విడుదల కారణంగా దెబ్బతిందని చెప్పుకొచ్చాడు. ఉస్తాద్ మూవీలో బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది.
ఈ రవి శివతేజ ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ కే అల్లుడు కావడం మరొక విశేషం. అప్పట్లో విజయ్ భాస్కర్ నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన కూతురు శ్యామలను రవి శివతేజ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాను శ్యామలను ప్రేమించే నాటికి డైరెక్టర్ విజయ్ భాస్కర్ కూతురని నాకు తెలియదని రవి శివతేజ చెప్పారు.
విషయం తెలిశాక భయం వేసింది. మా ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా అనే సందేహం కలిగింది. ఆ విషయంలో శ్యామలను మెచ్చుకోవాలి. తన కుటుంబ సభ్యులను ఒప్పించి మా పెళ్లి జరిగేలా చేసింది అన్నాడు. శ్యామల కష్ట సమయాల్లో నన్ను ఆదుకుంది. ఆమె తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చిందని రవి శివతేజ అన్నారు.
కాగా రవి శివతేజ బిగ్ బాస్ సీజన్ 7కి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన స్పందించారు. తాను బిగ్ బాస్ కి వెళుతున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. పైగా బిగ్ బాస్ కి వెళితే తన భార్య శ్యామల విడాకులు ఇస్తాను అందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. రవి శివతేజ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో పట్ల శ్యామలకు మంచి అభిప్రాయం లేదని ఆయన కామెంట్స్ తెలియజేస్తున్నాయి. కాగా బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం కానుంది.