India Vs Pakistan: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా శనివారం సంచలన ప్రకటన చేశారు. తన మాట మన్నించి భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయని వ్యాఖ్యానించారు. ” రెండు దేశాల మధ్య శాంతి నెలకొనడానికి అమెరికా తరఫున మధ్యవర్తిత్వం వహించాను. అది ఫలించింది. రెండు దేశాలు వెంటనే కాల్పుల విరమిస్తామని ప్రకటించాయి. రెండు దేశాలు సుహృద్భావాన్ని,ముందు చూపు ప్రదర్శించాయి. వారికి నా ధన్యవాదాలు అంటూ” ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత ఒక్కసారిగా చల్లబడింది..
Also Read: భారత్ సరిహద్దు దాడులు.. పాక్ పోస్టుల ధ్వంసం, రేంజర్ల పరార్
ప్రపంచం మీద ప్రభావం
భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచం మీద తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది మరింత జటిలం కాకముందే అమెరికా పెద్దన్న పాత్ర పోషించడానికి సిద్ధమైంది.. భారతదేశం పాకిస్తాన్ దేశంపై ఇదే స్థాయిలో దాడులు చేస్తే ప్రపంచ పటంలో ఉండదు అనే విషయం తెలిసిన అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. మరోవైపు ట్రంప్ నాయకత్వంపై ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. దీంతో చైనా అనూహ్యంగా ప్రపంచ శక్తిగా ఎదగడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. మరో వైపు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చడానికి తన వంతుగా ప్రయత్నిస్తానని చైనా ప్రకటించింది. అమెరికా మాత్రం ఉభయకుశలోపరి అనే పాత్రకు పరిమితమైపోయింది. ఇది ఒక రకంగా అగరాజ్యం నాయకత్వానికి.. అమెరికా పెద్దన్న పాత్రకు ఇబ్బంది కలిగించేదిగా ఉండడంతో.. ట్రంప్ రంగంలోకి దిగలేక తప్పలేదు. భారతదేశాన్ని బుజ్జగించి.. పాకిస్తాన్ దేశాన్ని హెచ్చరించి మొత్తానికి కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరికి తనే ఆ ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నిలుపుదల చేసి.. మొత్తంగా ప్రపంచానికి తన నాయకత్వమే శిరోధార్యమని ట్రంప్ నిరూపించారు. తమ దేశంలో వస్తున్న వ్యతిరేకతలను తగ్గించడానికి.. ప్రపంచం మీద పెత్తనాన్ని మరింత గట్టిగా చేయడానికి ట్రంప్ ఈ అవకాశాన్ని విజయవంతంగా ఉపయోగించుకున్నారు. అయితే కాల్పులు చేపట్టబోమని ఇరు దేశాలు ప్రకటించినప్పటికీ.. ఇచ్చిన మాట మీద పాకిస్తాన్ నిలబడుతుందా.. పాకిస్తాన్ కనుక గెలికితే భారత్ ఊరుకుంటుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది.
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025