India Vs Pakistan Ceasefire: భారత్ , పాకిస్తాన్ సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా నెలకొన్ని తీవ్ర ఉద్రిక్తతలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట ప్రకటించినట్లుగా, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్వయంగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది.
Also Read: భారత్ – పాక్ “ఇమీడియట్ సీజ్ ఫైర్” .. ట్రంప్ ఏం చేసి ఉంటాడు?
పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ప్రాంతీయ శాంతిభద్రతల కోసమే పాటుపడుతుందని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు. అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.
తాజాగా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, ఇది ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 2:35 గంటలకు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత ఆర్మీతో మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలు(గగన, సముద్ర, భూభాగాలు)నిలిపివేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, రాబోయే మే 12న పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతామని విక్రమ్ మిస్ట్రీ తెలిపారు.
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ గురించి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా స్పష్టత ఇచ్చారు. కాల్పులు ,సైనిక చర్యలను నిలిపివేయడం పై భారత్,పాకిస్తాన్ శనివారం ఒక అవగాహనకు వచ్చాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిరంతరం రాజీలేని వైఖరి కొనసాగిస్తుందిని .. ఇకముందు కూడా ఇలాగే కొనసాగిస్తుందని మంత్రి ట్వీట్ చేశారు.
ఈ పరిణామాలు ఇరుదేశాల మధ్య నెలకొన్ని తీవ్ర ఉద్రికత్తలను తగ్గించే దిశగా ఒక కీలక అడుగుగా పరిగణించబడుతున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఈ శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తోంది. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుంది.. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా మెరుగుపడతాయనేది వేచి చూడాలి. రాబోయే చర్చల్లో ఇరు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025