
భారత్ తో పాకిస్తాన్.. చైనా దేశాలు సరిహద్దుల్లో కయ్యానికి దిగుతున్నాయి. పాకిస్థాన్ కంటే భారత్ అన్నింటా మెరుగైన స్థితిలో ఉంది. దీంతో భారత్ ను నేరుగా ఎదుర్కోలేక పాకిస్తాన్ ఉగ్రమూకలతో దొంగదెబ్బ తీస్తోంది. భారత్ సైతం పాక్ ఉగ్రమూకలను సర్జికల్ స్టైక్స్ తో ఏరివేస్తోంది. అయితే ఇటీవల చైనా సైతం సరిహద్దుల్లో ఘర్షణకు దిగుతుండటంతో ఆందోళన మొదలైంది.
Also Read: అప్పుడే 6 కోట్ల ఓట్లు.. అమెరికా ఓటర్ల తీర్పు ఎటువైపు?
గాల్వానా లోయలో భారత్-చైనా సైనికుల మధ్య కొద్దినెలల క్రితం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో భారత్ చెందిన 21మంది సైనికులు వీరమరణం పొందగా చైనా జవాన్లు సైతం భారీగానే మృతిచెందారు. అయితే చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనే విషయాన్ని ఆ దేశం అధికారికంగా ప్రకటించలేదు. నాటి నుంచి ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
భారత్ తో చైనా యుద్ధానికి దిగితే అగ్రరాజ్యం అమెరికా ఖచ్చితంగా భారత్ కే మద్దతు ఇస్తుందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు బహిరంగగానే ప్రకటించాడు. ఈ మేరకు పలుసార్లు చైనాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. తాజాగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో భారత్ కు మద్దతును ప్రకటించాడు. గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన భారత సైనికులకు ఆయన నివాళులర్పించారు.
తాజాగా జరిగిన 2+2 ఇండియా-యూఎస్ మినిస్టీరియల్ డయలాగ్ అనంతరం సంయుక్త ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా మైక్ పొంపియో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశమని కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనిక సాహస వీరులను గౌరవించేందుకు జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించినట్లు తెలిపారు. భారత్ తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛలకు ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా మద్దతుగా నిలుస్తుందని ఆయన చెప్పారు.
Also Read: జేడీయూ, బీజేపీల మధ్య పోస్టర్ వివాదం..! మిత్రబంధం చెడిందా..?
భారత్ కు రక్షణ పరంగానే కాకుండా అన్నిరంగాల్లోనూ అమెరికా సహకారం ఉంటుందన్నారు. గత ఏడాది సైబర్ సమస్యలపై సహకారాన్ని పెంపొందించుకున్నట్లు, ఇండియన్ ఓషన్‌లో జాయింట్ ఎక్సర్‌సైజ్‌లను ఇరుదేశాల నావికా దళాలు నిర్వహించినట్లు తెలిపారు. అమెరికా పారదర్శకత మిత్రుల జాబితాలో చైనా లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి ఎదురయ్యే ముప్పులకు ఎదుర్కొనేందుకు భారత్ కు అమెరికా సహకారం ఉంటుందన్నారు.