https://oktelugu.com/

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం భారత్ వైపు ప్రపంచం

నేడు ప్రపంచంలో కలకలం రేపుతున్న కరోనా వైరస్ నుండి విముక్తి కోసం వాక్సిన్ తయారు చేయడం కోసం పలు దేశాలలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చైనా, అమెరికా దేశాలు ఈ దిశలో ముందంజలో ఉన్నాయి. అయితే ప్రపంచం మాత్రం ఈ విషయమై భారత్ వైపు చూస్తున్నది. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరో రెండుమూడు వారాల్లో ప్రారంభిస్తామని మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థ […]

Written By: , Updated On : April 27, 2020 / 11:58 AM IST
Follow us on


నేడు ప్రపంచంలో కలకలం రేపుతున్న కరోనా వైరస్ నుండి విముక్తి కోసం వాక్సిన్ తయారు చేయడం కోసం పలు దేశాలలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చైనా, అమెరికా దేశాలు ఈ దిశలో ముందంజలో ఉన్నాయి. అయితే ప్రపంచం మాత్రం ఈ విషయమై భారత్ వైపు చూస్తున్నది.

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరో రెండుమూడు వారాల్లో ప్రారంభిస్తామని మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ మనుషులపై వ్యాక్సిన్‌ ఔషధ పరీక్షలు విజయవంతమైతే, వచ్చే అక్టోబర్‌ నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.

జ‌న‌రిక్ డ్ర‌గ్స్‌, వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి చేయ‌డంలో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉన్నది. మరోవంక ప్ర‌పంచంలో అత్య‌ధిక స్థాయిలో టీకాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది కూడా మనమే. ప్ర‌స్తుతం కోవిడ్‌19 వ్యాధి కోసం వ్యాక్సిన్ త‌యారీ చేసేందుకు సుమారు అర‌డ‌జ‌ను కంపెనీలు భారత్ లో కృషి చేస్తున్నాయి.

దీంట్లో సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ప్ర‌ధాన‌మైంది. ప్ర‌పంచంలో అత్య‌ధిక వ్యాక్సిన్లు త‌యారు చేసేది ఈ కంపెనీయే. డోసుల ఉత్ప‌త్తి, వాటి అమ్మ‌కాల ఆధారంగా ఈ విష‌యాన్ని చెప్ప‌వ‌చ్చు.

ప్ర‌స్తుతం వైర‌స్ ప్ర‌బ‌లుతున్న తీరు చూస్తుంటే, ప్ర‌పంచ వ్యాప్తంగా మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యాక్సిన్ డోస్‌లు అవ‌స‌రం కాగా ఈ సంస్థకు సుమారు 500 మిలియ‌న్ల డోస్‌లు ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం ఉన్న‌ది.

మరోవంక, భార‌త్‌, అమెరికా కూడా క‌లిసి వ్యాక్సిన్ అభివృద్ధిపై ప‌నిచేస్తున్న‌ట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో ప్రకటించపారు. గ‌త మూడు ద‌శాబ్ధాల నుంచి రెండు దేశాలు వివిధ వ్యాక్సిన్ల త‌యారీలో క‌లిసి ప‌నిచేస్తున్నాయని చెప్పారు. డెంగ్యూ, ఎంట్రిక్ డిసీజెస్‌, ఇన్‌ఫ్లూయాంజా, టీబీ లాంటి వాటికి వ్యాక్సిన్లు త‌యారు చేశారు. అయితే డెంగ్యూ వ్యాక్సిన్‌కు మాత్రం ట్ర‌య‌ల్స్ చేయాల్సి ఉంది.

53 ఏళ్ల కంపెనీ సీర‌మ్ ఇన్సటిట్యూట్ ప్ర‌తి ఏడాది 1.5 బిలియ‌న్ల వ్యాక్సిన్ డోస్‌ల‌ను త‌యారు చేస్తుంది. పుణెలో ఆ కంపెనీకి రెండు ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు నెద‌ర్లాండ్స్‌, చెక్ రిప‌బ్లిక్‌లో చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఆ కంపెనీలో సుమారు ఏడు వేల మంది ప‌నిచేస్తున్నారు.

165 దేశాల‌కు ఈ కంపెనీ సుమారు 20 టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. ప్రపంచంలోనే చాలా తక్కువ ధరకు 80 శాతం వ్యాక్సిన్ల‌ను ఎగుమ‌తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ప్ర‌స్తుతం సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ కంపెనీ.. అమెరికాకు చెందిన కోడాజెన‌క్స్‌తో భాగ‌స్వామ్యం ఏర్ప‌ర్చుకున్న‌ది.

ఇద్ద‌రూ క‌లిసి లైవ్ అట్యునేటెడ్ వాక్సిన్‌ను త‌యారు చేస్తున్నారు. దీంతో వైర‌స్‌ను పూర్తిగా చంప‌లేక‌పోయినా.. దాని హాని‌క‌ర ల‌క్ష‌ణాల‌ను మాత్రం చంపేయ‌గ‌ల‌దు. ఏప్రిల్‌లో జంతువుల‌పై ట్ర‌య‌ల్స్ చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల సీరమ్ కంపెనీ సీఈవో తెలిపారు.

మరోవంక, హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ కూడా అమెరికాలోని విస్కాన్‌సిన్ మాడిస‌న్ వ‌ర్సిటీతో లింకు పెట్టుకున్న‌ది. ఫ్లూజెన్ కంపెనీతో జ‌త‌క‌లిసి సుమారు 300 మిలియ‌న్ల డోస్‌లు త‌యారు చేస్తున్నారు. జైడ‌స్ క్యాడిల్లా సంస్థ రెండు వ్యాక్సిన్ల‌పై వ‌ర్క్ చేస్తున్న‌ది.

బ‌యోలాజిక‌ల్ ఈ, ఇండియ‌న్ ఇమ్యూనోలాజిక‌ల్స్‌, మిన్‌వాక్స్ సంస్థ‌లు కూడా వ్యాక్సిన్అభివృద్ధి చేస్తున్నాయి. వ్యాక్సిన్ ఉత్ప‌త్తిపై భారీ పెట్టుబ‌డులు పెట్టిన‌ భార‌తీయ ఫార్మ‌సీ కంపెనీల‌కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ కొనియాడారు.