Union minister Narayan Rane: అమెరికాలో ధరలు భగ్గు మంటున్నాయి. ఇంగ్లాండ్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. యూరో జోన్ లో అంతా అతలాకుతలంగా ఉంది. చైనాలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు పట్టడం లేదు.. ఇలాంటి స్థితిలో కొద్దో గొప్పో బాగుంది అంటే అది మనదేశంలోనే… కానీ ఇప్పుడు మన దగ్గర కూడా పరిస్థితి ఏమంత బాగోలేదని కేంద్ర సూక్ష్మ, మధ్య తరహా సంస్థల మంత్రి నారాయణ్ రాణే బాంబు పేల్చారు.. జూన్ తర్వాత ఏదైనా జరగొచ్చని ఆయన హెచ్చరికలు జారి చేశారు. దీని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.

వాస్తవానికి గత కొద్ది నెలలుగా దేశానికి సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిలువలు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్టాన్ని ఎదుర్కొంటున్నది.. ఫలితంగా విదేశీ మదుపు దారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల ఆర్థిక రంగంలో తీవ్ర ఏర్పడుతున్నది. ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతోంది. ఇది ప్రజల కొనుగోలు శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.
2008 లో..
2008లో కూడా ఇటువంటి పరిస్థితినే ప్రపంచం ఎదుర్కొన్నది. చాలా దేశాలు ఇబ్బందులు పడ్డాయి. కొన్ని దేశాలు ఇప్పటికీ ఇంకా కోలుకొలేదు.. నాటి ఆర్థిక సంక్షోభం వల్ల లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు . ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితే నెలకొంది.

లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఐటీ కంపెనీలు రిక్రూట్మెంట్ వేశాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ కు కూడా బ్రేక్ వేశాయి.. దీంతో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలకు తెర లేపారు.. కేంద్రం సరైన ఆర్థిక విధానాలు పాటించకపోవడం వల్లే దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.. మరో వైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం లేదని చెబుతున్నది. ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అధ్వానంగా మారడంతో.. దేశంలోని సామాన్య జనాల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.