Donald Trump: ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికాలో దాక్కున్న , జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), పోలీసులు కోరుతున్న గ్యాంగ్‌స్టర్ల జాబితాను భారతదేశం సిద్ధం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారం అమెరికా పర్యటన సందర్భంగా గ్యాంగ్‌స్టర్లు గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ పేర్లతో కూడిన జాబితాను వాషింగ్టన్‌తో పంచుకోవాలని న్యూఢిల్లీ యోచిస్తోందని హోం మంత్రిత్వ శాఖ (MHA) అధికారిక వర్గాలు తెలిపాయి, హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, భారతదేశంలోని ప్రముఖ భద్రతా సంస్థలు అమెరికాలో నివసిస్తున్న గ్యాంగ్‌స్టర్ల జాబితాను రూపొందించాయి. కొన్ని వారాల క్రితం కేంద్ర ఏజెన్సీలు విదేశాలకు పారిపోతున్న నేరస్థుల జాబితాను నిర్వహించగా, వారి కేసుల స్థితిగతులతో పాటు అమెరికాలో ఉన్న నేరస్థుల జాబితాను ప్రత్యేకంగా రూపొందించే పనిని వారికి అప్పగించినట్లు వర్గాలు వెల్లడించాయి.
సిద్ధిక్ హత్య కేసులో నిందితుడు..
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Larance Bishnoi) సోదరుడు, ఎన్‌సీపీ నాయకుడు మరియు మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య కుట్ర వెనుక నిందితుడైన అన్మోల్, నకిలీ పత్రాలతో ప్రయాణిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు కనుగొన్న తర్వాత నవంబర్‌లో అమెరికాలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను అమెరికా జైలులో ఉన్నాడు. గత నెలలో, ముంబైలోని ప్రత్యేక కోర్టు సిద్ధిక్ హత్యకు సంబంధించి అన్మోల్ మరియు మరో ఇద్దరు వాంటెడ్ నిందితులకు నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
ఉగ్రవాదిగా గోల్డీ బ్రార్..
ఇక పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య వెనుక ప్రధాన సూత్రదారి గోల్డీబ్రార్(Goldi Brar). ఇతను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఉగ్రవాదిగా భావిస్తున్నారు. బిష్ణోయ్ ముఠాలో ప్రముఖ సభ్యుడు బ్రార్ పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందినవాడు. అతని అసలు పేరు సతీందర్‌జిత్ సింగ్. 2017లో విద్యార్థి వీసాపై కెనడాకు వచ్చిన తర్వాత, అతను తరువాత కాలిఫోర్నియాకు మకాం మార్చాడు.