India China: దాయాది దేశాలతో డ్రాగన్ వక్రబుద్ధితో ప్రవర్తిస్తోంది. కవ్వింపు చర్యలతో ఉద్రిక్తలకు పాల్పడుతోంది. సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టర్ లో చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటుతూ భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించడంతో వివాదం చోటుచేసుకుంది. వారి చర్యలను భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. సైనిక బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.

వాస్తవాధీన రేఖ దగ్గర సుమారు 200 మంది చైనా సైనికులు రావడంతో గుర్తించిన భారత సైన్యం వారిని వారించింది. ఈ క్రమంలో కొద్దిసేపు ఘర్షణ జరిగింది. తరువాత పరస్పర అంగీకారంతో ఇరు బలగాలు దూరం వెళ్లినట్లు తెలుస్తోంది. చైనా తరచూ చొరబాట్లకు యత్నిస్తూ మన సహనాన్ని పరీక్షిస్తోంది. ఈ ఏాడాది ఆగస్టు 30న సుమారు 100 మంది చైనా జవాన్లు ఉత్తరాఖండ్ లోని బారాహొతి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ దాటి ఐదు కిలోమీటర్లు లోపలికి ప్రవేశించారు.
సుమారు మూడు గంటల పాటు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి వంతెనను ధ్వంసం చేశారు. భారత సైన్యం అక్కడకు చేరుకునే లోపు వెళ్లిపోయారు. దీంతో డ్రాగన్ కుయుక్తులను భారత్ ఎండగడుతోంది. దాయాది దేశాలతో చైనా ఆలోచనలను ఖండిస్తున్నా మార్పు రావడం లేదు. ఫలితంగా భారత్ ను ఇరుకున పెట్టేందుకు పలు కోణాల్లో యత్నిస్తున్నట్లు సమాచారం.
భారత్, చైనా దేశాల మధ్య రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనున్న వేళ ఘర్షణ వాతావరణం సృష్టించడం ముందస్తు వ్యూహంలో ఒక భాగమే అని చెబుతున్నారు. భారత్ ను నిందించడానికే ఇలా కుట్రలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే 12 సార్లు కమాండర్ స్థాయి చర్చలు జరిగినా మూడు రోజుల్లో 13వ సారి జరిగే సమావేశంలో డ్రాగన్ ఏ నిర్ణయం ప్రకటిస్తుందో వేచి చూడాల్సిందే.