
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోడీ ఎగురవేశారు. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎర్రకోట వద్ద జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
శతాబ్ధి ఉత్సవాల నాటికి భారత్ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సమృద్ధ భారత నిర్మాణం అవుతుందని చెప్పారు.
స్వాతంత్ర్య కోసం పోరాడిన త్యాగధనులకు దేశం నమస్కరిస్తోందని.. స్మరించుకుంటోందని మోడీ అన్నారు. దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న వీరజవాన్లు, కరోనా వేళ ప్రజలను కాపాడిన వైద్యసిబ్బంది కృషిని మోడీ తన ప్రసంగంలో కొనియాడారు. ఒలింపిక్స్ లో పతకాలు సాధించినవారంతా మనకు స్ఫూర్తినిచ్చారని.. దేశం యావత్తూ వారిని గౌరవిస్తోందన్నారు.
దేశ విభజన గాయం నేటికి మనల్ని వెంటాడుతోందని పాకిస్తాన్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు మోడీ. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయన్నారు. టీకాలపై ఆందోళన పోయి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో జరుగుతోందని మోడీ అన్నారు. ఇప్పటివరకు దేశంలో 54 కోట్ల మందికి టీకాలు అందాయని మోడీ అన్నారు.
వచ్చే 25 ఏళ్లలో ప్రతి అడుగు కీలకం అని.. ఈ అమృతకాలన్ని సర్వ సమఋద్ధ భారత్ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలని మోడీ అన్నారు. సంక్షేమ పథకాల్లో వివక్ష వద్దని మోడీ సూచించారు.